ప్రయాగ్‌రాజ్, జూన్ 12: ఉత్తరప్రదేశ్‌లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లకు పోలీసుల కంటే ముందుగా బుల్డోజర్లు వెళ్తున్నాయి. శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లో చెలరేగిన హింసకు ప్రధాన కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జావెద్ అహ్మద్ ఇంటిని ఆదివారం బుల్డోజర్తో కూల్చేశారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని శనివారం శరణ్పూర్లో ఇద్దరు నిందితులు అబ్దుల్ వాకిర్, ముజమ్మిల్ ఇండ్లను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఈ మూడు కేసుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగానిర్మాణాలు ఉన్నాయని, అందుకే కూల్చివేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు, శుక్రవారం హింసతో సంబంధం ఉన్న 304 మందిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లపై జమ్ముకశ్మీర్, బెంగాల్లో మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్రలోని భివండీ పోలీసులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌కు సమన్లు పంపించారు. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో హిం సాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్తుండగా ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకొన్నారు. రెండు గంటల హైడ్రామా అనంతరం అనుమతించారు. బెంగాల్లోనే ఆదివారం సాయంత్రం అల్లరి మూక బేత్వాడహరి రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్‌ను ధ్వంసం చేసింది. దాడితో ఈ రూట్లో రైల్వే సేవలకు కొద్ది సేపు అంతరాయం కలిగింది.
పెచ్చరిల్లుతున్న విద్వేషం
దేశంలో విద్వేష వ్యాఖ్యలు, విద్వేష చర్యలు పెచ్చరిల్లుతున్నాయని, ప్రధాని మోదీ మౌనం వీడాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. తాము ఏమన్నా ప్రధాని మౌనంగా ఉంటున్నారంటే, ఆయన క్షమిస్తున్నట్టు విద్వేషకారులు భావిస్తారన్నారు. ఇస్లామిక్ దేశాలతో దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం కొన్నేండ్లుగా భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకొన్నదని, ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.
నిరసనలకు రిటర్న్ గిఫ్ట్!
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలపై నిరసన తెలిపిన తొమ్మిది మందిని యూపీ పోలీసులు దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు పోలీసులు లాఠీలతో నిరసనకారులను విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యం నెటిజన్లను కదిలించింది. ఈ వీడియోను యూపీ బీజేపీ ఎమ్మెల్యే మణి త్రిపాఠి ట్వీట్ చేశారు. ‘నిరసనకారులకు ఇది రిటర్న్ గిఫ్ట్’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఇది ఏ పోలీస్ స్టేషన్లో జరిగిందన్న వివరాలను త్రిపాఠి వెల్లడించలేదు.