న్యూఢిల్లీ, నవంబర్ 2: పశ్చిమబెంగాల్లో ఫ్లైఓవర్ కూలితే ప్రధాని మోదీ దైవ సందేశం అన్నారు. ఆర్థికవృద్ధి ఆగిపోతే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్టు మోర్బీ కాంట్రాక్టర్ 130కి పైగా ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన దైవలీల అని సాక్షాత్తూ కోర్టుకే అప్పజెప్పారు. గుజరాత్లో డబుల్ ఇంజిన్ సర్కారు కదా.. అందుకే బాధ్యత ఎవరిదన్న ప్రశ్నను ప్రధానితో పాటుగా హోంమంత్రి అమిత్ షా కూడా మాట వరసకైనా ప్రస్తావించలేదు. కేంద్రం, రాష్ట్రం బాధితులకు సాయం ప్రకటించి చేతులు దులిపేసుకున్నాయి. ఇదంతా చూసి బహుశా వంతెన పనులు చేసిన కాంట్రాక్టర్లకు ధైర్యం వచ్చిందేమో.
అరెస్టయిన కంపెనీ మేనేజర్లలో ఒకరైన దీపక్ పారేఖ్ ‘ఇదంతా దైవలీల’ అని కోర్టుకే చెప్పాడు. అంతా భగవదేచ్ఛ అని చేతులెత్తేశాడు. తనకు కాంట్రాక్టు ఇచ్చినోళ్లను ఎందుకు అరెస్టు చేయలేదని గడుసుగా ప్రశ్నించాడు. మోదీ అనుకూల మీడియా ఒకడుగు ముందుకు వేసి దైవలీలతో పాటు ప్రజల పొరపాటు కూడా ప్రమాదానికి కారణమని తీర్మానించింది. కాంట్రాక్టర్‌కు అనుభవం లేదు. పనులు సరిగా చేయలేదు. అనుమతి ప్రభుత్వ విభాగాల తనిఖీలు, అనుమతులు లేకుండా జనాన్ని అనుమతించారు. ఈ సంగతులన్నీ కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో ఉన్నాయి. ఫ్లోరింగ్ బరువు వంతెన కూలిపోవడానికి ప్రధాన కారణమని ఆ నివేదికలో స్పష్టంగా ఉందని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. నిందితుల పట్ల ప్రజాగ్రహం ఎంతగా ఉందంటే మోర్బీ న్యాయవాదులు వారి తరఫున వాదించేందుకే నిరాకరించారు. పైగా నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రదర్శన కూడా జరిపారు.
టెండర్ లేకుండా కాంట్రాక్టు
లైటుబల్బులు తయారు చేసే ఒరేవా కంపెనీకి వంతెన మరమ్మతుల కాంట్రాక్టు గుజరాత్ బీజేపీ సర్కారు కట్టబెట్టింది. టెండర్ లేదు. బిడ్లు లేవు. నేరుగా పని అప్పగించింది. సదరు ఒరేవా కంపెనీకి వంతెన మరమ్మతు పనుల్లో ఏమాత్రం అనుభవం లేదని అధికారుల నివేదికలే ఘోషిస్తున్నాయి. ఎప్పుడో వందేళ్ల పైచిలుకు కాలంనాటి పాత వంతెనకు మరమ్మతులు చేస్తామంటూ ముందుకు వచ్చిన అస్మదీయ కాంట్రాక్టర్ తీరుపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వంతెన పాత కేబుల్స్ మార్చలేదు. చిలుము పట్టిన పాత కేబుల్స్కే కొత్త రంగు వేశారు. అచ్చంగా మోదీ సందర్శించిన దవాఖానకు వేసినట్టుగానే. పైగా వంతెనకు కాంట్రాక్టర్లు వేసిన ఫ్లోరింగ్ బరువు ఎక్కువైంది. రివెట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్ చేయలేదు. అప్పనంగా కాంట్రాక్టు కొట్టేసి పైపై మెరుగులతో రిపేరు పూర్తయిందని చెప్పి స్థానిక మున్సిపాలిటీకి కనీసం సమాచారం ఇవ్వకుండా సందర్శకులను అనుమతించి ఘోర ప్రమాదానికి కారకులయ్యారు ఒరేవా కంపెనీ కాంట్రాక్టర్లు. లోపల్లోపల నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మోర్బీ జిల్లా ఎస్పీ రాహుల్ త్రిపాఠీ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ‘ఎవరినీ కాపాడటం లేదని’ వివరణ ఇచ్చుకున్నారు. ప్రధానితో సహా అధికార గణం మోర్బీ ఘటనపై స్పందిస్తున్న తీరును కాంగ్రెస్‌తో పాటుగా విపక్షాలన్నీ ఎండగడుతున్నాయి.
ఈడీ, సీబీఐ ఏమైపోయాయ్?
మోర్బీ ఘటనపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుచేయాలి. వంతెన కూలిన ఘటనకు బాధ్యులైన వారిని ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. సాధారణ ప్రజలపైనే వారు (సీబీఐ, ఈడీ) చర్యలు తీసుకుంటారు.
– బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
సోషల్‌మీడియాలో సెటైర్స్!
బీజేపీ మా‘డల్’పై సోషల్‌మీడియాలో సెటైర్లు పటాకుల్లా పేలుతున్నాయి. సాక్షాత్తూ ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘వందే భారత్’ రైళ్లకు రోజుకో ప్రమాదం జరుగడం, పునర్మిర్మాణం చేసి ప్రారంభించిన ఐదు రోజుల్లోనే గుజరాత్‌లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి నదిలో కూలడంపై నెటిజన్లు విమర్శనాస్ర్తాలు సంధించారు. యూపీలో వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లపైనా చురకలంటించారు. ‘పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట.. అట్లా ఉంది మన బీజేపీ సర్కారు పనితనం’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ఆకతాయి పోరగాళ్లు ఊపితే కూలిపోయే బ్రిడ్జీలు.. ఆవులు, బర్రెలు, కాగితాలు అడ్డమొచ్చి టక్కర్ అయ్యే హైస్పీడ్ రైళ్లు, చిన్నవానకే కొట్టుకుపోయే నేషనల్ హైవేలు.. గుజరాత్, యూపీలోనే ఉంటాయి.. అదేం మ్యాజిక్కో.. అంటూ డబుల్ ఇంజిన్ సర్కారును ఓ ఆట ఆడుకుంటున్నారు.
మోదీ వస్తే దవాఖానకే రంగు పడుద్ది
ప్రధాని మోదీ వస్తున్నారంటే రంగులు అద్దాల్సిందే. మెరుగులు దిద్దాల్సిందే. చివరికి అది దవాఖాన అయినా అంతే. ఫొటోల్లో తేడా రావద్దు మరి. మోదీ రాకకు ముందు కళ తప్పివున్న మోర్బీ దవాఖాన ఆయన వచ్చేసరికి జిగేల్‌జిగేల్ మని మెరిసింది. కొత్త పరువులు, గోడలకు రంగులు, రకరకాల సామగ్రితో అధికారులు హడావిడిగా నింపేశారు. పేషంటు కూడా మారిపోవాల్సిందే. కొత్త వేషం కట్టాల్సిందే. వినోదమైనా, విషాదమైనా నాటకం రక్తి కట్టాల్సిందే. మొదట్లో ఒకరకంగా ఉన్న పేషంటు కట్లు మోదీ వస్తాడనగానే రూపు మార్చుకొన్నాయి. మరి మోదీయా మజాకా?
ప్రధాని మోదీ గుజరాత్ మోర్బీ వంతెన దుర్ఘటన బాధితులను పరామర్శించిన తీరు, అందుకు దవాఖానను ముస్తాబు చేసిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘోర విషాదం నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి నేరుగా మోర్బీకి వెళ్లారా? అంటే అదీ లేదు. ఎన్నికల ప్రచారాలు, సభలు అన్నీ పూర్తి చేసుకుని తాపీగా బాధితుల వద్దకు వెళ్లారు. ఎక్కడా ఫొటోషూట్‌కు మాత్రం ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త పడ్డారు. టిప్‌టాప్‌గా తయారై రాత్రికిరాత్రే రంగులు మారిన దవాఖానకు వెళ్లి కెమెరాకు అనుగుణంగా రోగులను పరామర్శించి తన బాధ్యత తీరిపోయిందన్నట్టుగా వెళ్లిపోయారు.
పేషంట్ల బ్యాండేజీలూ మారిపోయాయి