Union Cabinet : నరేంద్రమోదీ కొత్త ప్రభుత్వం కొలువదీరిన తర్వాత తొలి క్యాబినెట్ భేటీ జరిగింది. సోమవారం సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులందరికి శాఖలను కేటాయించడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి అవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. అయితే ముందుగా ప్రధాని మోదీ రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దాంతో దేశంలోని 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందనుంది.
క్యాబినెట్ భేటీకి ముందు పీఎంవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలని అక్కడి అధికారులకు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వంద రోజుల ప్రణాళికను మోదీ బృందం ఇప్పటికే సిద్ధం చేసుకుంది.