న్యూఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్రధాని మోదీ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ట్రంప్ వత్తిడికి మోదీ తలొగ్గినట్లు ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలో రిపోర్టర్లతో రాహుల్ మాట్లాడారు. ఎప్స్టీన్ ఫైల్స్ కేసు వల్ల ప్రధాని మోదీ తీవ్ర వత్తిడిలో ఉన్నట్లు ఆరోపించారు. అదానీపై అమెరికాలో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మోదీ ఆందోళనలో ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. మోదీజీ భయపడుతున్నారని, నాలుగు నెలలుగా వాణిజ్య ఒప్పందం స్తంభించిందని, కొన్ని కారణాల తప్ప ఏమీ మారలేదని, నిన్న సాయంత్రం ఒప్పందం కుదుర్చుకున్నారని గాంధీ అన్నారు.
నరేంద్ర మోదీపై తీవ్రమైన వత్తిడి ఉన్నట్లు రాహుల్ తెలిపారు. మోదీ ఇమేజ్‌కు చెందిన బెలూన్ వేల కోట్లతో తయారైందని, అది ఏ క్షణమైనా పేలుతుందని ప్రతిపక్ష నేత అన్నారు. మన ప్రధాని అమెరికా వత్తిడికి తలొగ్గారని, భారత దేశ ప్రజలు దీని గురించి ఆలోచించాలని, భారతీయ రైతులు ఆ డీల్ గురించి ఆలోచించాలని, మీ శ్రమ, రక్తం, చమటను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. కేవలం రైతులే కాదు. యావత్ దేశాన్ని అమ్మేశారని, అందుకే తనను సభలో మాట్లాడనివ్వడం లేదని రాహుల్ అన్నారు.