న్యూఢిల్లీ, జూలై 31: ‘ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్’ (ఐఐపీఎస్) నుంచి వెలువడిన పలు నివేదికలు మోదీ సర్కార్‌కు మింగుడుపడటం లేదు. దీంతో ఐఐపీఎస్ డైరెక్టర్ కేఎస్ జేమ్స్‌ను సస్పెండ్ చేస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై వేటు వేసింది. ఐఐపీఎస్ రూపొందించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5సహా పలు నివేదికల్ని మోదీ సర్కార్ జీర్ణించుకోలేకపోయిందని, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోయేసరికి సంస్థ డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారని పలువురు సైంటిస్టులు అన్నారు.
డైరెక్టర్ కేఎస్ జేమ్స్ సస్పెన్షన్ వెనుక రాజకీయ కోణం ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్ఎస్పీ తదితర పార్టీలు ఆరోపించాయి. దేశ అభివృద్ధిపై వాస్తవ గణాంకాలు బయటకురావటంతో మోదీ సర్కార్ భయపడుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సిర్కార్ అన్నారు. ‘ప్రధాని మోదీ పాలనలో ప్రజారోగ్యం అధ్వాన్నంగా తయారైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్హెచ్ఎఫ్ఎస్) గణాంకాలు ఇదే విషయాన్ని బయటపెట్టాయి. ఎన్హెచ్ఎఫ్ఎస్-6ను అర్ధాంతరంగా ఆపేసి.. సంస్థ డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు’ అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్
విమర్శించారు.