AIPEU | న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా మహోద్యమం సాగించిన రైతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తున్నది. తాజాగా రైతుల ఆందోళనకు మద్దతు పలికాయని, ఢిల్లీలోని సీపీఎం కార్యాలయం నుంచి పుస్తకాలు కొనుగోలు చేశాయన్న ఆరోపణలతో పోస్టల్ ఉద్యోగ సంఘాలు ఆలిండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐపీఈయూ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయూస్(ఎన్‌ఎఫ్‌పీఈ) గుర్తింపును రద్దు చేసింది. ఆరెస్సెస్‌కి చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ సంస్థ భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్(బీపీఈఏ) ఫిర్యాదు మేరకు కేంద్రం ఆయా పోస్టల్ ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేయడం గమనార్హం.
1920లో ప్రారంభమైన ఏఐపీఈయూ
1920లో కోల్‌కతాలో ఏఐపీఈయూ ప్రారంభమైంది. ఇక పోస్టల్ సెక్టార్లో ఎన్‌ఎఫ్‌పీఈ అతిపెద్ద ఫెడరేషన్‌గా ఉన్నది. ఇందులో ఏఐపీఈయూతో సహా ఎనిమిది పోస్టల్ ఉద్యోగ సంఘాలు అనుబంధంగా ఉన్నాయి. ఆయా సంఘాల గుర్తింపును ఉపసంహరిస్తూ పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ నహర్ సింగ్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. ఏఐపీఈయూ ఖాతా నుంచి రైతాంగ ఉద్యమానికి, సీపీఎం, సీఐటీయూకి డబ్బులు వెళ్లాయని, రాజకీయ విరాళాలు ఇవ్వడం అనేది సీసీఎస్(ఆర్ఎస్ఏ) రూల్స్-1993కి విరుద్ధమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అది విరాళం కాదు
రైతుల ఆందోళనకు ప్రత్యక్షంగా విరాళం అందించలేదని, రైతాంగ ఉద్యమానికి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, కార్మికుల సమాఖ్య (సీసీజీఈడబ్ల్యూ)కి విరాళం అందజేశామని ఎన్‌ఎఫ్‌పీఈ అధికారులకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నది. సీపీఎంకు విరాళం ఆరోపణలపై స్పందిస్తూ.. సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఉన్న బుక్‌షాపులో కొన్న పుస్తకాలకు సంబంధించి ఆ చెల్లింపులు చేశామని, అవి విరాళాలు కావని స్పష్టం చేసింది.
కార్మిక సంఘాలను నిరోధించేందుకే..
కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని సంస్థాగతంగా వ్యతిరేకిస్తామని ఎన్‌ఎఫ్‌పీఈ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే మురళీధరన్ పేర్కొన్నారు. పోస్టల్ విభాగంలో అన్ని కార్మిక సంఘాల కార్యకలాపాలను నిరోధించే లక్ష్యంతో తాజా యూనియన్ల రద్దు నిర్ణయం జరిగిందని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. 2014లో నిర్వహించిన రెఫరెండంలో ఎన్ఎఫ్పీఈకి 75 శాతం ఉద్యోగుల ఓట్లు రాగా, బీఎంఎస్ మద్దతు యూనియన్‌కు 5 శాతం కంటే తక్కువ వచ్చాయని పేర్కొన్నారు. కాగా, ఇటీవల పోస్టల్ సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్‌ఎఫ్‌పీఈ ఇటీవల ఒక రోజు సమ్మె నిర్వహించింది.పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కోరింది.