Kharge : అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఇవాళ మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల (Petrol, Diesel prices) ను పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున ధరలు పెరిగాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి కాదు. గత రెండు వారాల్లో ఐదుసార్లు పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12 కు, లీటర్ డీజిల్ రూ.95.25 కు చేరింది. ఇక హైదరాబాద్ (Hyderabad) లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58 గా, లీటర్ డీజిల్ ధర రూ.103.74 గా ఉంది.
అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఇంధన ధరల భారం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ఈ రోజువారీ దోపిడీతో ఎవరు బాగుపడుతున్నారని ప్రశ్నించారు. సామాన్యులు కూడబెట్టుకున్న పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందని విమర్శించారు. కేవలం రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఐదుసార్లు పెంచారని మండిపడ్డారు. 2014లో లీటర్ పెట్రోల్ రూ.71.41గా ఉంటే ఇప్పుడు రూ.102.12కు చేరుకుందని గుర్తుచేశారు.
రోజువారీ ఇంధన దోపిడీ ఇంకా ముగిసిపోలేదని ఖర్గే హెచ్చరించారు. గత పన్నెండేళ్లలో మోదీ ప్రభుత్వం ఇంధనంపై రూ.43 లక్షల కోట్లు దోచుకుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఐదోసారి పెరగడంతో ఇవాళ హెచ్పీపీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ షేర్లు పెరిగినట్లు కేంద్రం చెబుతోందని అన్నారు. ప్రజల అవసరాల కంటే లాభానికే ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ నైజమని విమర్శించారు. ఇంధన ధరల పేరుతో రైతుల నుంచి ఎంఎస్ఎంఈల వరకు, సమాజంలోని ప్రతి వర్గం బీజేపీ దోపిడీ భారాన్ని మోస్తోందని అన్నారు.