సుప్రీంకోర్టు ఒత్తిడితో కేంద్రం దిగివచ్చింది. అదానీపై అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తించిన హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశీయ మదుపరులకు రక్షణ విషయమై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. మార్కెట్ నియంత్రణ వ్యవస్థల బలోపేతానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది. అయితే సభ్యుల పేర్లను సీల్డ్ కవర్లో అందిస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది.
మరోవైపు మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతూనే ఉన్నది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లక్ష్యాన్ని అదానీ గ్రూప్ భారీగా కుదించుకున్నట్టు బ్లూంబర్గ్ వార్తాసంస్థ వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రతిపాదన మేరకు స్టాక్ మార్కెట్ నియంత్రణ యంత్రాంగాలను బలోపేతం చేసేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా అంగీకరించింది. కమిటీ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. కమిటీకి సంబంధించిన పేర్లను త్వరలో ఇస్తామని, అయితే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కమిటీ పేర్లు, దాని పరిధి వివరాలను సీల్డ్కవర్లో అందిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు.
స్టాక్మార్కెట్లో మదుపరుల ప్రయోజనాలకు ప్రస్తుతం సరైన రక్షణ లేకపోవడంపై సుప్రీంకోర్టు గత శుక్రవారం విచారణ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మదుపరుల రక్షణకు పటిష్ఠమైన పద్ధతులను ప్రవేశపెట్టేందుకు డొమైన్ నిపుణులు, ఇతరులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. సోమవారం విచారణ సందర్భంగా కేంద్రం, సెబీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెబీ, ఇతర సంబంధిత సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కమిటీ అధికార పరిధి ఇక్కడ చాలా ముఖ్యమని, స్టాక్‌మార్కెట్ నియంత్రణ వ్యవస్థ బలోపేతానికి కమిటీ ఏర్పాటు విషయంలో అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులకు ఏదైనా అనుకోని సందేశం బయటకు వెళ్తే.. అది నిధుల ప్రవాహంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. బుధవారం నాటికి పేర్లు సూచించాలని సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం ఈ సందర్భంగా సూచించింది.
స్టాక్‌మార్కెట్ పెద్ద వ్యక్తులదే కాదు..
అదానీ గ్రూపు షేర్ల విలువను కృత్రిమంగా దిగజార్చి(ఆర్టిఫిషియల్ క్రాష్) అమాయక మదుపరులను దోపిడీ చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం శుక్రవారానికి లిస్టింగ్ చేసింది. పటిష్టమైన యంత్రాంగాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై అభిప్రాయాలు తెలుపాలని కూడా సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు సెబీని కోరింది. స్టాక్‌మార్కెట్ అంటే పెద్ద పెట్టుబడిదారులు ఉండే వ్యవస్థ మాత్రమే కాదని, మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టుబడులు పెడుతున్నారని న్యాయస్థానం పేర్కొన్నది.
అదానీ షేర్ల పతనం వల్ల భారతీయ ఇన్వెస్టర్లు లక్షలాది కోట్ల రూపాయలు నష్టపోయారని పలు నివేదికలు పేర్కొన్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంతకుముందు ఈ రెండు పిల్స్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 10న విచారణ చేసింది. మదుపరుల రక్షణ కోసం పటిష్టమైన నియంత్రణ పద్ధతులను తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేయాలని ఈ సందర్భంగా సూచించింది. అదానీ గ్రూపు షేర్లను కృత్రిమంగా తగ్గించడం వల్ల స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారులకు రూ.10 లక్షల కోట్లపై పైగా నష్టం వాటిల్లినట్టు పిటిషనర్లు పిల్స్లలో పేర్కొన్నారు.