న్యూఢిల్లీ, జూన్ 4: దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ శకం మొదలైంది. పదేండ్ల కిందటి రాజకీయ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యాయి. అలకలు, బుజ్జగింపులు, అవిశ్వాసాలు, అధికార మార్పిడులు మళ్లీ మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014, 2019లో ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఒంటరిగానే అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ దక్కించుకుంది. పేరుకు ఎన్డీయేగా అధికారంలో ఉన్నా బీజేపీకి ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం పడలేదు. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు 31 సీట్ల దూరంలో.. 241 వద్దనే నిలిచిపోయింది. దీంతో అధికారంలోకి రావడానికి, ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. 1951లో మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 73 ఏండ్లలో 32 ఏండ్ల పాటు దేశంలో పార్టీలు కూటమిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 1977లో ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత భారతీయ జనసంఘ్ నేతృత్వంలో 11 పార్టీలు కలిపి జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వం 1979 వరకు కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు కూడా 2004 నుంచి 2014 రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వమే దేశాన్ని పాలించింది. 2014లో 282 సీట్లతో, 2019లో 303 సీట్లతో మోదీ సారథ్యంలో ఇతర పార్టీల మద్దతుతో పనిలేకుండా బీజేపీ అధికారం చేపట్టింది.
ప్రసుతం బీజేపీ అధికారం చేపట్టాలంటే 16 సీట్లు ఉన్న టీడీపీ, 12 సీట్లు ఉన్న జేడీయూపై మద్దతు అవసరం. ఈ రెండు పార్టీలు ఎన్నికలకు ముందే ఎన్డీయేలో చేరాయి. అయితే, వీరు ఇప్పుడు ఎన్డీయేలోనే కొనసాగుతారా? ఇండియా కూటమి వైపు మళ్లుతారా ? అనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు 2019లో కాంగ్రెస్‌తో పని చేసిన అనుభవం ఉంది. కొన్ని నెలల క్రితం వరకు జేడీయూ అధినేత నితీశ్ ఇండియా కూటమిలోనే ఉన్నారు. కాబట్టి, వీరు ఎన్డీయే కూటమిని వదలడం అసాధ్యం ఏమీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు కూలుతాయో, ఎవరు అలక వహిస్తారో, ఎవరు అవకాశం కోసం ఎదురుచూసి ప్లేట్ ఫిరాయిస్తారో తెలియని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ఉదంతాలు దేశంలో గతంలో ఉన్నాయి. కూటమిలోని పార్టీల మద్దతు ఎల్లప్పుడూ కలిగి ఉండేలా చూసుకోవడం ప్రధానికి తలనొప్పి వ్యవహారంగా ఉంటుంది. ఉదాహరణకు.. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీకి మమతా బెనర్జీ మద్దతు ఉండేది. అయితే, పీఎస్‌యూల మూసివేత పట్ల మమతా బెనర్జీ అలక వహించారు. దీంతో వాజ్‌పేయీ నేరుగా కోల్‌కతా వెళ్లి బుజ్జగించాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు మళ్లీ వస్తాయా ? లేదా ఈ ఐదేండ్లు సాఫీగా సాగిపోతాయా ? అనేది చూడాల్సి ఉంది.