Modani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ దౌత్య సంబంధాలను సైతం వాడారన్న విమర్శల నేపథ్యంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ప్రధాని మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆ రాష్ట్రంలో ప్రధాని హోదాలో పర్యటించినట్టు కెన్యా మాజీ ప్రధాని రాయిలా ఒడింగా పేర్కొన్నారు.
మోదీ ఆహ్వానం మేరకే తాను, తన దౌత్య సిబ్బంది ఆ రాష్ట్రంలో పర్యటించినట్టు వెల్లడించారు. ఈ పర్యటనలో అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పోర్ట్, పవర్ ప్లాంట్, రైల్వేలైన్, ఎయిర్‌స్ట్రిప్ తదితర ప్రాజెక్టులను మోదీ ప్రత్యేకంగా చూపించి విశేషాలను తెలియజెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒడింగా మాట్లాడిన ఓ వీడియోను ప్రముఖ జర్నలిస్ట్ రావి నాయర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మోదానీ (మోదీ-అదానీ) బంధం మరోసారి బహిర్గతమైందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
కెన్యాలో నిరసనలు
ఏఎల్జీ అనే స్థానిక సంస్థ మెరుగైన ప్రతిపాదనను పక్కనబెట్టి మరీ అదానీ కంపెనీకే దేశంలోని నైరోబీ ఎయిర్‌పోర్టు విస్తరణ, నిర్వహణ పనులను ప్రభుత్వం అప్పగించడంపై కెన్యా పౌరులు తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సర్వత్రా ఒత్తిళ్లు పెరుగడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని కెన్యా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(కేఏఏ)ని కెన్యా జాతీయ అసెంబ్లీ ప్రజా పెట్టుబడుల కమిటీ ఆదేశించింది.
టెండరు ప్రక్రియపై ప్రత్యేక ఆడిట్ జరిపే వరకు అదానీ గ్రూప్‌తో తదుపరి ప్రక్రియలను నిలిపివేయాలని సూచించింది. కాగా ఈ డీల్‌ను ఒడింగా సమర్థించడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు, అదానీ కంపెనీతో విమానాశ్రయ డీల్‌ను రద్దు చేసుకొన్న కెన్యా సర్కారు.. విద్యుత్తు లైన్ల ఏర్పాటు, కరెంటు సరఫరా కోసం 30 ఏండ్లకు గానూ అదే అదానీ గ్రూప్ కంపెనీతో తాజాగా మరో ఒప్పందం చేసుకోవడం విమర్శలకు దారితీస్తున్నది.
లంకలోనూ అలాగే శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో నిర్మించ
తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్‌ప్లాంటును పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. అదానీ కంపెనీకి లబ్ధి చేకూర్చే ఈ డీల్ కోసం భారత ప్రధాని మోదీ, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఫెర్డినాండో 2022లో బయటపెట్టారు.
కాగా పోటీ లేకపోవటంతో అదానీ గ్రూప్‌నకు 25 ఏండ్లలో 4 బిలియన్ అమెరికన్ డాలర్ల అయాచిత లాభం చేకూరుతుందని శ్రీలంక ఇంజినీర్లు తేల్చిచెప్పారు. ఇది దేశానికి ఆర్థిక భారమేనని పేర్కొన్నారు. ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో గత ప్రభుత్వ పెద్దలతో అదానీ గ్రూప్ లోపాయికారి ఒప్పందాలపై అనూరకుమార దిస్సనాయకే నేతృత్వంలోని శ్రీలంక కొత్త ప్రభుత్వం పునఃసమీక్షించనున్నట్టు ప్రకటించింది.