అటు యుద్ధ వ్యూహాల్లోనూ, ఇటు దౌత్య సంబంధాలు నెరపడంలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు.. దక్షిణాసియాలో భారత్ తన పట్టును తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయని ప్రముఖ కాలమిస్ట్, నేపాల్‌కు చెందిన గ్లోబల్ పొలిటికల్ ఎకానమిస్ట్ భీమ్ భుర్టెల్ అభిప్రాయపడ్డారు. 26మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడి, పాక్‌తో యుద్ధ ఉద్రిక్తతలు, దాని తదనంతర పరిణామాలు.. ప్రధాని మోదీ విశ్వసనీయతను మునుపెన్నడూ లేనంత సంకటస్థితిలోకి నెట్టాయని.. నాయకత్వ వైఫల్యాల నుంచి భారత్ బయటకు వచ్చి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఏషియా టైమ్స్’కు రాసిన తన తాజా వ్యాసంలో భారత్‌లోని పరిణామాలను ఆయన విశ్లేషించారు. భారత నాయకత్వ వైఫల్యాలు, అంతర్జాతీయ సమాజం దృక్కోణం గురించి కుండబద్ధలు కొట్టారు. భీమ్ భుర్టెల్ వ్యాసంలోని ముఖ్యాంశాలివీ..
మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరాన్ని తుడిచిన వాడి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం. మన సైనిక శక్తి పాక్‌కు నిద్రపట్టనివ్వడం లేదు. పాక్ అణు బ్లాక్‌మెయిల్‌ను మన సైన్యం అపహాస్యం చేసింది. వణికిపోయిన పాక్ ప్రపంచం మొత్తం తిరుగుతూ అందర్నీ ప్రాధేయపడింది. కాల్పుల విరమణకు మన డీజీఎంవోని సంప్రదించింది.
కాల్పుల విరమణకు మేం ప్రాధేయపడినట్టుగా పచ్చి అబద్ధాన్ని భారత ప్రధాని చెప్తున్నారు. సింధూ జలాలను నిలిపివేయడం పాక్‌ను రెచ్చగొట్టడమే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ‘కాల్పుల విరమణ’ నిర్ణయం వీగిపోతుంది. సింధూ జలాల వివాదాన్ని పరిష్కరించకుంటే, పరిస్థితి యుద్ధ చర్యకు దారితీయొచ్చు.
‘మన సైన్యం వీరోచితంగా పోరాడుతూ గెలుపు వాకిట నిలబడ్డప్పుడు, గెలుస్తున్నప్పుడు.. పంజాబ్ ప్రాంతం రాగానే (మన సైన్యం దాని దరిదాపుల్లోకి రాగానే) కాల్పుల విరమణను ప్రకటించారు. అది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పిదం. దాని ఫలితంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏర్పడింది. నాడు ఆ కాల్పుల విరమణను మూడు రోజులు ఆలస్యంగా ప్రకటించి ఉంటే.. పీవోకే ఇప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉండేది. పూర్తి కశ్మీర్‌ను గెలుచుకోకుండానే నాడు సీజ్ఫైర్ ప్రకటించారు’
“కశ్మీర్ సంక్షోభ సంక్లిష్టతల నేపథ్యంలో భారత అంతర్గత భద్రతావ్యవస్థలో దీర్ఘకాలంగా నెలకొన్న బలహీనతలను పహల్గాం దాడి తేటతెల్లం చే సింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్, ఆక్రమిత కశ్మీర్లో వైమానిక దాడులను మోదీ ప్రభుత్వం చేపట్టింది. సైన్యం హోరాహోరీగా పోరాడుతున్న వేళ.. మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంసిద్ధత వ్యక్తంచేయడం విస్మయపరుస్తున్నది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపారని గ్లోబల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా ఒత్తిడితోనే మే 10న భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయన్నది వాటి సారాంశం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మీడియా ముందు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇరుదేశాలను బెదిరించి, కాల్పుల విరమణపై రాజీ కుదిర్చానని ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం భారత్-పాక్ మధ్య డీజీఎంవో స్థాయిలో తదుపరి చర్చలు జరిగాయి. ఈ చర్యతో అణ్వాయుధ సామర్థ్యమున్న ఇరుదేశాల మధ్య తాత్కాలికంగా ఉద్రిక్తతలు కొంత చల్లబడ్డప్పటికీ.. ప్రాంతీయ సమీకరణాల విషయంలో అమెరికా లాంటి బాహ్యశక్తులపై ఆధారపడాల్సి రావడం భారత్‌లాంటి దేశానికి అవమానకరమే. ఇది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి పెద్ద మరక. అదే సమయంలో ఇప్పటివరకు ఇరుదేశాల ఇష్యూగా ఉన్న కశ్మీర్ వివాదంతోపాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం కీలకమనే అంశాన్ని తాజా ఉదంతం తెరపైకి తెచ్చింది. స్వయంగా మూడోదేశం జోక్యాన్ని అంగీకరించడం.. భారత్ దౌత్యపరమైన పరిమితులను బహిర్గతం చేసింది.
కొన్ని దశాబ్దాలుగా దక్షిణాసియాలో భారత్ ప్రభావశీల దేశంగా నిలుస్తూ వచ్చింది. అమెరికా విదేశాంగ విధానానికి కొత్త అర్థం చెప్పిన మన్రో సిద్ధాంతంతో సరిసమానమైన ప్రాంతీయ ఆధిపత్యాన్ని హిందూ మహాసముద్ర తీర దేశాలపై భారత్ చాటుతూ వచ్చింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల వంటి పొరుగుదేశాలపై తన పట్టును పెంచుకోవడం ద్వారా, ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత్ నిలబడింది. అయితే పహల్గాం ఘటన, తర్వాత అమెరికా జోక్యం ఈ ఆధిపత్యానికి గండి కొట్టాయి. ఇన్నాళ్లూ భూటాన్ లాంటి దేశాలపై చెక్కుచెదరని ప్రభావం చూపిన భారత్ స్థానంలో ఇప్పుడు బాహ్యశక్తులు రావడం.. క్షీణిస్తున్న భారత ఆధిపత్యానికి మరో సంకేతం. పొరుగున ఉన్న దేశాలతోనూ పరిస్థితులేం ఆశాజనకంగా లేవు. నేపాల్‌తోనూ సంబంధాలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి. పాశ్చాత్య దేశాల మద్దతుతో అక్కడి ప్రభుత్వం భారత్ పెద్దరికాన్ని సవాల్ చేస్తున్నది.
మరోవైపు బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు క్రమంగా చైనా, ఇతర ప్రపంచ శక్తులతో సంబంధాలు మరింతగా పెంచుకుంటున్నాయి. కొన్నాళ్లుగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఉపఖండంలో భారత్ పరపతిని పలుచన చేస్తూ వస్తున్నాయి. ఒకప్పుడు దక్షిణాసియాలో ప్రబల శక్తిగా ఉన్న భారత్ ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఈ క్రమంలో పహల్గాం దాడి.. భారత్ బలహీనతలను మరింత బహిర్గతం చేసింది. ఇన్నాళ్లు ఢిల్లీని పెద్దన్నలా చూసిన దేశాలు.. ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెట్టే అవకాశాలు మరింతగా పెరగనున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటినుంచి మోదీ పదే పదే భారత్‌ను విశ్వగురువుగా, అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్‌గా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆర్థిక వృద్ధి, సైనిక ఆధునికీకరణ, ప్రపంచస్థాయిలో పలుకుబడి అందుకు సంకేతాలుగా ఆయన ఉదహరిస్తూ వచ్చారు. అయితే భారత్ ఇప్పటికీ ‘సూపర్ పవర్’ హోదాకు దూరంగా ఉన్నదని, తీవ్రమైన పరిమితులతో ఒక మధ్యస్థాయి శక్తిగానే మిగిలిందని గుర్తించాలి. ఈ దశలో పహల్గాం దాడి, దాని తదనంతర పరిణామాలు ఆ అంచనాలపైనా దెబ్బకొట్టాయి.
భారత్ బలహీనపడుతున్నదనే విమర్శలు ప్రత్యర్థులైన పాకిస్థాన్ నుంచో, చైనా నుంచో కాకుండా మిత్రపక్షంగా భావిస్తున్న అమెరికా నుంచి వస్తుండటం గమనార్హం. ‘గ్రేట్ ఫ్రెండ్’ అంటూ మోదీ తరుచూ చెప్పుకునే అమెరికానే.. 2021 నవంబర్‌లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్’ పేరిట నిర్వహించిన ఆపరేషన్ హిందూ మహాసముద్రం జలాల్లో భారత ఆధిపత్యానికి కొంతమేర నష్టంచేసింది. ‘ఇండియా క్రమంగా అగ్రరాజ్యం గుప్పిట్లో చిక్కుకుంటున్నదా?’ అన్న అనుమానాలు అప్పుడే చాలామందిలో కలిగాయి. ఇప్పుడు కాల్పుల విరమణలో అమెరికా జోక్యం తర్వాత ఆ ‘పట్టు’ ఎంతలా బిగుసుకుపోతున్నదో అర్థమవుతున్నది. మోదీ నుంచి అమెరికా పెద్దఎత్తున రాయితీలను పొంది ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ‘లావాదేవీ దౌత్యం’తో భారత స్వయంప్రతిపత్తి సన్నగిల్లుతుందని, అగ్రరాజ్యం ఆధీనంలోని ఓ పావుగా దేశం మారిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే.. భారత్ సూపర్ పవర్ ఆశలు అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యాలకు లోబడే ఉంటాయి. బహుళ ధ్రువ ప్రపంచంలో దశాబ్దాలుగా భారత్ కాపాడుకుంటూ వచ్చిన తన స్వతంత్ర ప్రతిపత్తి ప్రమాదంలో పడవచ్చు.
పాశ్చాత్య దేశాల పొగడ్తల వెనుక ఉన్న అగాధాలను గ్రహించడంలో మోదీ విఫలమయ్యారా? ఒకవేళ అదే నిజమైతే భారత్ వ్యూహాత్మక వైఖరికి ఇది తీవ్ర నష్టదాయకం. పాశ్చాత్య శక్తులు తరుచూ వారు మార్చగల నాయకులను ప్రశంసిస్తాయి. అది వారి వ్యూహంలో భాగం. ఆ వ్యూహాన్ని మోదీ తప్పుగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రశంసలను ఆయన సొంత పరాక్రమానికి రుజువులుగా భావించి ఉండవచ్చు. భారత దేశపు నిజమైన బలం దాని ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక పురోగతి, వ్యూహాత్మక చతురతలో ఉన్నదేకానీ పాశ్చాత్య దేశాల డొల్ల ప్రశంసల్లో కానీ, దేశీయ మీడియా గాలికొట్టే కథనాల్లో కానీ లేదని గ్రహించాలి. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దౌత్యవేత్త ఎస్ జైశంకర్‌ను 2015లో విదేశాంగశాఖ కార్యదర్శిగా, 2019లో విదేశాంగ మంత్రిగా నియమించారు. అయితే జైశంకర్ భారత విదేశాంగ విధానాన్ని క్రమంగా అమెరికా వైపు మొగ్గుచూపేలా మార్చారన్న అరోపణలున్నాయి. అయితే ఆ మొగ్గు భారత్ కన్నా అమెరికాకే ఎక్కువ ప్రయోజనకారి అయ్యింది.
అదే సమయంలో అనుకూలమీడియా ఆకాశానికెత్తడం, శక్తిమంతమైన నేతగా పదే పదే చిత్రీకరించడం.. వాస్తవిక ప్రపంచం నుంచి మోదీని దూరంగా తీసుకొని వెళ్లాయి. పహల్గాం వైఫల్యం, తదనంతర పరిణామాల్లో అమెరికా జోక్యం.. ఈ గాలి బుడగకు గుండుపిన్ను గుచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయంగా తన ఆధిపత్యాన్ని భారత్ తిరిగి పొందాలంటే.. తన వ్యూహాత్మక వైఖరిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరమున్నది. ఆర్థిక పునరుజ్జీవం, సైనిక ఆధునికీకరణ, విదేశాంగ విధానాన్ని తిరిగి శక్తిమంతం చేసుకోవడం ద్వారా మాత్రమే భారత్ గత ప్రాభవాన్ని తిరిగి పొందగలదు. సమతుల్య, దృఢమైన దౌత్యాన్ని అనుసరించడం.. అమెరికా సహా పాశ్చాత్య దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం కూడా అంతే ముఖ్యం. ప్రపంచ వేదికపై తన పాత్రను పునర్ నిర్వచించుకోవడానికి భారత్ దిద్దుబాటుకు పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.