Modi Cabinet : నరేంద్రమోదీ ఇవాళ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. రాత్రి 7.05 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతోపాటు 30 ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని ప్రముఖులతోపాటు పలువురు విదేశీ ప్రముఖులు కూడా ఢిల్లీకి విచ్చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మోదీతోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే 30 మంది వీళ్లేనంటూ కొందరి పేర్లపై ప్రచారం జరుగుతోంది. వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, జై శంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, అశ్వనీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, కిరణ్ రిజిజు.. నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. వారితోపాటు కొత్తగా శివరాజ్ సింగ్ చౌహాన్, జేపీ నడ్డాను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారితోపాటే అర్జున్ మేఘవాల్, మనోహర్‌లాల్ ఖట్టర్, రావు ఇంద్రజీత్ సింగ్, కమల్జీత్ సెహ్రవాత్, భూపేంద్ర యాదవ్, ఎల్ మురుగన్, ప్రహ్లాద్ జోషి, శోభా కరాంద్లజె, నిముబెన్ బంబానియా, జుయెల్ ఓరం తదితర నేతలకు కూడా మోదీ మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, పరుషోత్తం రూపాలా లాంటి వారికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏకంగా ఐదుగురికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనుంది. ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, బీజేపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు మంత్రివర్గం బెర్త్ ఖరారైనట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని ఈ సారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. మిత్రపక్ష నేతల్లో హెచ్డీ కుమార స్వామి (జేడీఎస్), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), లలన్‌సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), జితన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎమ్), జయంత్ చౌధరి (ఆర్ఎల్డీ), అనుప్రియా పటేల్, ప్రతాప్ రావు జాదవ్ (శివసేన – శిండే), రామ్‌దాస్ అథవాలె (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వినిపిస్తున్నది.