న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడటానికి ఊతమిస్తున్న ఏపీ, బీహార్ల రుణాన్ని మోదీ క్యాబినెట్ తీర్చుకుంటున్నది. ఆ రెండు రాష్ర్టాల కోసం ప్రత్యేకంగా రూ.6,798 కోట్ల అంచనా విలువతో రెండు రైలు ప్రాజెక్టులను గురువారం మంజూరుచేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది.
256 కిలోమీటర్ల పొడవైన నర్కటియాగంజ్-రక్సౌల్ సీతామర్హి దర్భంగా సీతామర్హి ముజఫర్‌పూర్ సెక్షన్లో డబ్లింగ్ పనులకు, అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కి.మీ. రైలు మార్గానికి క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులతో తెలుగుదేశం అధికారంలో ఉన్న ఏపీకి, జేడీయూ అధికారంలో ఉన్న బీహార్‌కు లబ్ధి చేకూరనుంది. టీడీపీ, జేడీయూ పార్టీలు కేంద్రంలో బీజేపీ సర్కారుకు కీలక మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి మంజూరైన కొత్త రైలు మార్గం ఎన్టీఆర్ విజయవాడ, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి వెళ్లనుంది.