న్యూఢిల్లీ: అమెరికాలో ఈ నెల చివరిలో నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోవడం లేదు. ఈ మేరకు తాత్కాలిక వక్తల జాబితాలో పీఎం మోదీ పేరును ఐకరాజ్య సమితి ప్రకటించలేదు. ఈ నెల 9న యూఎస్ జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు కీలక సమావేశాలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 23న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సమావేశాల్లో మాట్లాడనున్నారు.
అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నాక ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడం ట్రంప్‌కు ఇదే మొదటిసారి. అయితే ఈ సమావేశాల్లో భారత్ నుంచి ప్రధాని మోదీకి బదులు కేంద్ర మంత్రి జైశంకర్ పేరును పొందుపరిచారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 26న ప్రధాని మోదీ ఈ సమావేశాల్లో ప్రసంగించాల్సి ఉంది. ఆయనతో పాటు ఇదే రోజు ఇజ్రాయెల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతలు కూడా ఉండనున్నట్టు షెడ్యూల్ ఉంది.