జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సహ విద్యార్థి శుక్రవారం కత్తితో దారుణంగా పొడిచాడు. గాయపడిన విద్యార్థిని దవాఖానకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఇంటిని బుల్డోజర్తో కూల్చేశారు. ఈ సంఘటన గురించి బయటకు పొక్కడంతో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. హిందూ సంస్థలు నిరసన ప్రదర్శనలు చేశాయి.
ఉదయ్‌పూర్ జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం భజన్‌లాల్ శర్మ ఆదేశాల మేరకు, గాయపడిన విద్యార్థికి చికిత్స చేసేందుకు ముగ్గురు వైద్యుల బృందం జైపూర్ నుంచి ఉదయ్‌పూర్ చేరుకుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 24 గంటలపాటు నిలిపేయాలని డివిజినల్ కమిషనర్ రాజేంద్ర భట్ ఆదేశించారు.
పీఏసీ చైర్మన్‌గా ఎంపీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, ఆగస్టు 17: పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నియమితులయ్యారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా బైజయంత్ పాండాలు నియమితులైనట్టు లోక్‌సభ సచివాలయం ఒక బులెటిన్ జారీ చేసింది.
ఈ మూడు కమిటీలతో పాటు పలు శాఖలు, విభాగాలకు సైతం స్టాండింగ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఓబీసీ సంక్షేమ కమిటీకి బీజేపీ ఎంపీ గణేష్ సింగ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీకి అదే పార్టీకి చెందిన ఎంపీ ఫగ్గన్ సింగ్ కులాస్తే నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో సభ్యులుగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు.