Meghalaya | మేఘాలయలో సీఎం కన్రాడ్ సంగ్మా ఆఫీసు వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రోడ్డును వందల మంది ఆందోళనకారులు బ్లాక్ చేశారు. దీంతో సీఎం కన్రాడ్ సంగ్మాతోపాటు మరో మంత్రి సీఎం కార్యాలయంలోనే ఉండిపోయారు. సీఎం కన్రాడ్ సంగ్మా క్షేమంగానే ఉన్నారు.
తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు కోసం గారోహిల్స్ పౌర సమాజ సంఘాలు నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో వందల మంది ఆందోళనకారులు సీఎంవోను చుట్టుముట్టారు. కొందరు నిరసనకారులు సీఎంఓపై రాళ్లు విసరడంతో వారికి, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. దీంతో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు కావడంతో వారిని సీఎంఓ లోపలికి తీసుకెళ్లారు.ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా.. ఉద్రిక్తత కొనసాగుతుందని సీఎంఓ తెలిపింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అంతకుముందు సుమారు మూడు గంటల పాటు పౌర సంఘాల ప్రతినిధులతో రాజధాని ఏర్పాటు విషయమై సీఎం సంగ్మా శాంతియుతంగా చర్చిస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్లు విసిరిన వ్యక్తులకు, పౌర సంఘాల ప్రతినిధులకు సంబంధం లేదని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చేనెల 8,9 తేదీల్లో షిల్లాంగ్లో చర్చలకు రావాలని పౌర సంఘాల ప్రతినిధులను సీఎం కన్రాడ్ సంగ్మా ఆహ్వానించారు.