పట్నా: బీహార్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 24 స్థానాల్లో ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదలచేసింది. దాంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ, ఆర్జేడీతోపాటు అన్ని పార్టీలు వ్యూహరచనల్లో తలమునకలై ఉన్నాయి. తమకు ఎన్ని స్థానాల్లో పోటీకి అవకాశం ఉన్నది..? తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎలాంటి వ్యూహరచన చేయాలి..? అనే అంశాల్లో బీజీ అయిపోయాయి.
అయితే, అధికార కూటమి ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నది. కూటమి నుంచి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనేదానిపై అప్పుడే ఒక అంగీకారం కుదిరింది. బీజేపీ 13 స్థానాల్లో, జేడీయూ 11 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం జరిగింది. బీజేపీ పోటీచేయబోతున్న 13 స్థానాల్లో ఒక సీటును పశుపతి పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి కేటాయించనున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ 80కి పైగా సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.