బెంగళూరు : కర్ణాటకలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిలదీస్తున్నారు. ఇండి ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తనదైన శైలిలో సీఎం తీరును ఎండగట్టారు. కరవు సహాయక చర్యలను సక్రమంగా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా సరైన విధంగా స్పందించడం లేదని మండిపడ్డారు. ఆల్మట్టి, నారాయణ్పుర జలాశయాల నీరు చిట్టచివరి భూములకు చేరడం లేదని, రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జి మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని, ఇతర నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, తాము రాష్ర్టానికి మంత్రులమనే విషయాన్ని మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు రైతులకు ఎటువంటి సహాయాన్ని అందించడం లేదన్నారు.