MK Stalin : ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదని, అవి ఒడిశా నుంచి తమిళనాడుకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడుకు వచ్చి ఇక్కడి ప్రజలను పొగిడిన మోదీ.. ఇప్పుడు ఒడిశాలో తమిళ ప్రజలను కించపర్చారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఆ భగవంతుడితోపాటు తమిళ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని స్టాలిన్ మండిపడ్డారు. ప్రధాని ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేవలం ఓట్లు పొందేందుకే ప్రధాని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రధాని వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆలయంలోని నిధిని తస్కరించారని తమిళ ప్రజలను ఎలా కించపరుస్తారని ప్రశ్నించారు. దేశ నాయకుడంటే అన్ని రాష్ట్రాల ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలని, ప్రధాని మాత్రం ద్వేషపూరిత ప్రసంగాలతో శతృత్వాన్ని సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.