చెన్నై, మే 9: ఎన్నో ఏండ్లుగా తమతో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ తమ కూటమి నుంచి విడిపోయి విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలపవడం పట్ల తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శనివారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పెడుతూ గెలిచిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం డీంఎకే కార్యాలయాన్ని సందర్శించి కృతజ్ఞతలు కూడా తెలపలేదని, ఎన్నికల్లో డీఎంకే పొత్తుతో విజయం సాధించిన విషయం కూడా వారు గుర్తు చేసుకోలేదని, పైగా కూటమితో బంధాన్ని తెంచుకున్నారని అన్నారు.
ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీవీకేకు మద్దతు పలికిన సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే పార్టీలు కూడా తమ కూటమితోనే కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటును డీఎంకే ఎంతమాత్రం అడ్డుకోదని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తన పాత్ర పోషిస్తుందని స్టాలిన్ తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు జరగకుండా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తమ కూటమి పార్టీలు తీసుకుంటున్న ఏ నిర్ణయాన్ని ఆయినా తమ పార్టీ, నేతలు గౌరవిస్తారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో తమ కూటమి పార్టీలు మద్దతు తెలిపినా డీఎంకే కూటమిలోనే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.