న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధాన నగరమైన టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ సమీపంలో క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆదివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు. (Air India flight diverted) అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆదివారం ఉదయం యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణి టెల్ అవీవ్ విమానాశ్రయం సమీపంలో పేలింది. ఈ దాడి నేపథ్యంలో ఆ ఎయిర్‌పోర్ట్‌కు విమాన రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు.
కాగా, ఆదివారం ఉదయం ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరింది. మరో గంటలో ఆ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఎయిర్ ఇండియా విమానం జోర్డాన్ గగనతలంలో ఉండగా టెల్ అవీర్ ఎయిర్పోర్ట్ సమీపంలో క్షిపణి దాడి జరుగడంతో దానిని మూసివేసినట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అబుదాబికి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అక్కడి విమానాశ్రయంలో నార్మల్‌గానే ల్యాండ్ చేసినట్లు పేర్కొంది. ఆ విమానం అబుదాబి నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుందని వెల్లడించింది.
మరోవైపు టెల్ అవీవ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు. అలాగే ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసులను మే 3 నుంచి 6 వరకు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టిక్కెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు రీషెడ్యూల్ లేదా ఒకసారి మినహాయింపు లేదా రద్దు చేస్తుకుంటే పూర్తిగా తిరిగి ఇస్తామని పేర్కొంది. కస్టమర్లు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా పునరుద్ఘాటించింది.