లక్నో: పెళ్లికి నిమిషాల ముందు లక్షల విలువైన బంగారు నగలతో వధువు పరారైంది. (Bride Vanishes With Jewellery) ఆమె కోసం వెతికిన వరుడు, అతడి కుటుంబం చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ దొంగ అని తెలిసి వారు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శాండిలోని నవాబ్గంజ్కు చెందిన నీరజ్ గుప్తాకు ప్రమోద్ అనే బాబా పరిచయమయ్యాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న అతడికి షాహాబాద్కు చెందిన మహిళను ఆ బాబా పరిచయం చేశాడు. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. పెళ్లికి అంగీకరించిన వీరిద్దరూ ఈ విషయాన్ని బాబాకు చెప్పారు.
కాగా, జనవరి 20న నీరజ్, ఆ మహిళ పెళ్లికి సిద్ధమయ్యారు. నీరజ్ కుటుంబం, ఆ మహిళ, బాబా కలిసి స్థానిక గుడికి వెళ్లారు. అక్కడ జరిగిన పూజా కార్యక్రమంలో వరుడు నీరజ్ కుటుంబం వధువుకు 3.5 లక్షల విలువైన బంగారు నగలు అలంకరించారు. ఆ తర్వాత వారంతా కలిసి రిజిస్టర్ మ్యారేజ్ కోసం స్థానిక కోర్టుకు చేరుకున్నారు.
మరోవైపు పెళ్లికి ముందు నీరజ్, ఆ మహిళ కలిసి ఫొటోలు దిగారు. అయితే రిజిస్టర్ మ్యారేజ్ కోసం సంతకాలు చేసే కొన్ని నిమిషాల మందు వధువు షాక్ ఇచ్చింది. వరుడు నీరజ్ కుటుంబం ఇచ్చిన రూ.3.5 లక్షల విలువైన బంగారు ఆభరణలతో ఆ మహిళ, బాబా పరారయ్యారు.
కాగా, నీరజ్, అతడి కుటుంబ సభ్యులు వధువు కోసం అక్కడ వెతికారు. బాబాతో కలిసి పారిపోయిన ఆమె తమను మోసగించిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వధువు దొంగ అని తెలుసుకుని వారు షాక్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.