న్యూఢిల్లీ, అక్టోబర్ 23: తమ పేరిట ఉన్న ఆస్తులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అమ్మినా లేదా బదిలీ చేసినా మైనర్లు తమకు 18 ఏండ్లు నిండిన తర్వాత ఎటువంటి దావా లేకుండానే కోర్టులో సవాలు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తమకు తెలియకుండా జరిగిన ఆస్తి లావాదేవీల విషయంలో వయోజనులుగా మారిన మైనర్లు స్పష్టమైన చర్యలు తీసుకోవచ్చని, వాటిని రద్దు చేయవచ్చని, లేదా తిరిగి విక్రయించవచ్చు లేదా బదిలీ చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు కర్ణాటకకు చెందిన కేఎస్ శివప్ప వర్సెస్ కే నీలమ్మ కేసులో జస్టిస్ మిత్తల్ తీర్పును వెలువరించారు.
కర్ణాటకలోని శామనూరు గ్రామంలో రుద్రప్ప అనే వ్యక్తి తన ముగ్గురు మైనర్ కుమారుల పేరిట ఆస్తి కొనుగోలు చేశారు. కోర్టు అనుమతి లేకుండానే రుద్రప్ప తన మైనర్ కుమారుల పేరిట ఉన్న సదరు ప్లాట్లను ఇతరులకు విక్రయించారు. యుక్తవయస్సుకు వచ్చిన రుద్రప్ప కుమారులు ఆ ప్లాట్లను శివప్పకు విక్రయించారు. అయితే అంతకుముందు తండ్రి వద్ద ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అవి తమవేనని పేర్కొనడంతో వివాదం మొదలైంది. తండ్రి జరిపిన విక్రయాలను రద్దు చేయడానికి కుమారులు తొలుత దావా వేయాలని కింది కోర్టులు తీర్పు చెప్పాయి.
ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టతనిచ్చింది. ఈ కేసులో కుమారులు దావా వేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. మైనర్లు మేజర్లుగా మారిన తరువాత తమ సంరక్షకులు జరిపిన అమ్మకాన్ని తిరస్కరించవచ్చని, తిరిగి తామే ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేయవచ్చని తేల్చి చెప్పింది. తమ పేరిట ఉన్న ఆస్తులను తమ సంరక్షకులు లేదా తల్లిదండ్రులు జరిపే లావాదేవీల విషయం మైనర్లకు తెలియకపోవచ్చని పేర్కొంది. అందువల్ల వారు దావా వేయాల్సిన అవసరం లేదని తెలిపింది.