తిరువళ్లూరు: తమిళనాడుతోని తిరువళ్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుమ్మిడిపూండిలోని సిప్కాట్ పారిశ్రామిక ప్రాంతంలో మూడేండ్ల పసికందుపై లైంగిక దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం గుమ్మిడిపూండి ప్రాంతంలోని పొదల్లో బాధిత చిన్నారి తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే ఆ చిన్నారిని దవాఖానకి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చి ఉంటున్నది.
నిందితుడిని కూడా బీహార్ కూలీగా పోలీసులు గుర్తించారు. స్థానికులు అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసులో ముగ్గురు అనుమానితులను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపింది. డీఎంకే నేత ఇలంగోవన్ స్పందిస్తూ, ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మాజీ నేత కే అన్నామలై ఈ ఘటనను ఖండిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు.