Deportation | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే 104 మంది భారతీయులకు సంకెళ్లు వేసి సైనిక విమానంలో అమృత్సర్కు పంపిన ట్రంప్ సర్కారు.. తాజాగా మరికొందరు భారతీయులను వెనక్కి పంపేందుకు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం అక్కడ 487 మంది భారతీయులు డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారని, వారంతా తుది బహిష్కరణ జాబితాలో ఉన్నట్టు అమెరికా ప్రభుత్వం భారత్కు తెలియజేసిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికాకు అక్రమంగా వలస వెళ్లినట్టు గుర్తించిన భారతీయులను సురక్షితంగా, గౌరవప్రదంగా భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
12 నుంచి అమెరికాలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12,13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. రెండో పర్యాయం ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆయనను మొదటిసారి కలవనున్నారు. భారత్ దిగుమతులపై సుంకాల విధింపు, అక్రమ వలసదారులను భారత్కు పంపివేత తదితర అంశాలతో పాటు పలు ద్వైపాక్షిక విషయాలు చర్చించనున్నారు.