దాహోద్, మే 17: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.71 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గుజరాత్ మంత్రి బచ్చూభాయ్ ఖబడ్ కుమారుడు బల్వంత్ ఖబడ్ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పని చేయకుండా లేదా వస్తువులు సరఫరా చేయకుండా ప్రభుత్వం నుంచి కొన్ని కాంట్రాక్టు ఏజెన్సీలు చెల్లింపులు పొందినట్లు ఆరోపణలు రాగా ఈ కుంభకోణంలో మంత్రి కుమారుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దాహోద్ జిల్లాలోని అప్పటి తాలూకా అభివృద్ధి అధికారి(టీడీఓ) దర్శన్ పటేల్‌ని కూడా అరెస్టు చేయడంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు.
దేవ్‌గఢ్ బరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న బచ్చూభాయ్ ఖబడ్ పంచాయత్, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. నకిలీ పని పూర్తి సర్టిఫికెట్లు, ఇతర నకిలీ సాక్ష్యాలను సమర్పించి 2021-2024 మధ్య రూ.71 కోట్ల ప్రభుత్వ నిధులను ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై 35 ఏజెన్సీలకు చెందిన యజమానులు స్వాహా చేశారని ఆరోపణలు నమోదయ్యాయి. దాహోద్‌లోని దేవ్‌గఢ్ బరియా, ధన్పూర్ తాలూకాలలో ఉపాధి హామీ పనుల పేరుతో మోసానికి పాల్పడ్డారని ఓ అధికారి తెలిపారు.