లాతూర్: ప్రభుత్వ పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని, విద్యార్థుల కంటే మంత్రుల కుక్కలకే మెరుగైన వసతులు అందుతున్నాయని పేర్కొంటూ, మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఇటీవలే ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభించిన దీప్కే తాజాగా లాతూర్‌లోని ఔసా తహసీల్, ఉజని గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు, సురక్షితమైన రాకపోకల వంటి కనీస మౌలిక వసతులు లేని అనేక పాఠశాలల దుస్థితికి ప్రజాప్రతినిధులు, మంత్రులే జవాబుదారీ వహించాలని అన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా సీజేపీ చేపట్టిన తనిఖీలు అధికారులను కదిలించాయని, పాఠశాలల్లో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యేలా చేశాయని దీప్కే తెలిపారు.