– ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కారం
కారేపల్లి, అక్టోబర్ 05 : కారేపల్లిలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయానికి సంబంధించిన భూ వివాదానికి సోమవారం తెరపడింది. సుమారు పదేళ్లుగా కొనసాగుతున్న వివాదాన్ని ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకున్నారు. శివాలయానికి సంబంధించిన 11 కుంటల భూమి ఆలయానికే ఉండాలని గ్రామస్థులు గతంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్థులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ శివాలయ భూమి పరిరక్షణ కోసం వారు తమ ప్రయత్నాలను కొనసాగించారు. తాజాగా శివాలయం ఆనుకుని ఉన్న భూమి యజమానులు శివాలయ భూమి విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంగీకరించి పరస్పర ఒప్పందానికి రావడంతో వివాదం ముగిసింది. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, ఆదెర్ల రాములు, తొగరు శ్రీను, గ్రామస్థులు రామకృష్ణ, వాసు, ఇమ్మడి సీతారాములు, కోట అనిల్ పాల్గొన్నారు.