బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో (Karnataka) ఓ మంత్రి తీరు వివాదాస్పదంగా మారింది. ఓ చీటింగ్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి.. తన బంధువు కాబట్టి వదిలేయాలంటూ కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. కేసు నుంచి అతడ్ని బయటపడేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి సూచించారు. సంబంధిత పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్‌మీడియా వేదికగా బహిర్గతమైంది.
అందులో సదరు మంత్రి పోలీస్ అధికారితో ఏమన్నారంటే, ‘అతడు మా బంధువే.. వదిలేయండి. నాకు బాగా కావాల్సిన వ్యక్తి. కేసు నుంచి బయటపడేందుకు అతడికి సాయం చేయండి’ అంటూ జమీర్ అహ్మద్‌ఖాన్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు చిక్కబళ్లాపురా జిల్లాలో స్థానిక రైతుల నుంచి పెద్ద మొత్తంలో మక్కజొన్నను కొనుగోలు చేశారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బు జూలై నుంచి చెల్లించటం లేదు. దీనిపై పెరిసంద్ర పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది.