కోల్‌కతా: భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై ఇటీవల అమెరికా, కెనడా దేశాలు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశాలు చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Minister Jaishankar) కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ దేశాల తమ పాత అలవాట్లను పోనిచ్చుకోవడం లేదన్నారు. ప్రపంచాన్ని 200 ఏళ్ల పాటు శాసించినట్లు పశ్చిమ దేశాలు ఫీలవుతుంటాయని, ఇండియా వాళ్లను పట్టించుకోవడం లేదన్న విషయాన్ని ఆ దేశాలు తట్టుకోలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత సర్కారును కెనడా ప్రధాని ట్రూడో తప్పుపట్టిన విషయం తెలిసిందే. కానీ ట్రూడో చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది కూడా. సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ను హత్య చేసేందుకు ఇండియా ప్లాన్ వేసినట్లు అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను తేల్చేందుకు ఇండియా ఓ ఎంక్వైరీ ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో జైశంకర్ రియాక్ట్ అయ్యారు. ప్రపంచాన్ని శాసించాలన్న పాత బుద్దిని పశ్చిమ దేశాలు వదులుకోలేకపోతున్నట్లు ఆరోపించారు.
మన దేశంపై పెత్తనం చేయాలన్న ఆలోచనలో ఆ దేశాలు ఉన్నాయని, ఎందుకంటే గడిచిన 80 ఏళ్ల నుంచి ప్రపంచ దేశాలపై ఆ దేశాలు ప్రభావం చూపాయని, అయితే గడిచిన 200 ఏళ్ల నుంచి ప్రపంచాన్ని శాసించామన్న ఆలోచనలో ప్రశ్చిమ దేశాలు ఉన్నాయని, అలాంటి స్థాయిలో ఉన్న దేశాలు తమ పాత పద్ధతిని ఎలా మార్చుకుంటాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అడిగారు. ఎన్నికల ఫలితాల కోసం కోర్టులను ఆశ్రయించే దేశాలు ఇప్పుడు మనకు ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న అంశంలో పాఠాలు చెబుతున్నాయని విమర్శించారు.