న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. అయితే ఆయన స్థానంలో ఆగస్టు 15వ తేదీన మంత్రి ఆతిషి(Minister Atishi) జాతీయ జెండాను ఆవిష్కరించాలని(Flag Hoisting) ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత గోపాల్ రాయ్.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు చెందిన అదనపు కార్యదర్శికి లేఖ కూడా రాశారు. కానీ ఆ రిక్వెస్ట్‌ను అదనపు కార్యదర్శి తోసిపుచ్చారు.
ఇది న్యాయబద్దమైన అంశం కాదు అని ఆయన తెలిపారు. ఆప్ నేత రాసిన లేఖకు అర్హత ఉండదని, దాన్ని ఆమోదించలేమన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున జెండా ఎగురవేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తెలిపింది. కానీ ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో దీనిపై నిర్ణయాన్ని ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టారు.
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఛాత్రాసాల్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేస్తుంది.