జైపూర్: అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న డీఎస్పీ, పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అడ్డుకునే క్రమంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడు. దీంతో ఇసుక మాఫియా వ్యక్తులు రెచ్చిపోయారు. డీఎస్పీ వాహనానికి నిప్పుపెట్టారు. (Mining Mafia Sets DSP’s Vehicle On Fire) రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి చౌత్ కా బర్వారా ప్రాంతంలోని బనాస్ నది వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ లాభూరామ్ విష్ణోయ్, పోలీసులు, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ దాడిలో ట్రాక్టర్ డ్రైవర్ మరణించారు. దీంతో ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులు పోలీసులతో ఘర్షణపడ్డారు. డీఎస్పీ వాహనానికి నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, డీఎస్పీ ఐరాన్ రాడ్తో తలపై కొట్టడంతో బుండి నివాసి సర్జ్ఞాన్ మీనా మరణించినట్లు అతడి సోదరుడు ఆరోపించాడు. తమ కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే సోదరుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారని విమర్శించాడు. స్థానిక గ్రామస్తులు కూడా ఈ సంఘటనపై నిరసన తెలిపారు. శుక్రవారం ఉదయం చౌత్ కా బర్వారా పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.