న్యూఢిల్లీ : టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే ఇక నుంచి డబుల్ పెనాల్టీ కట్టాల్సిందే. రైల్వేశాఖ టికెట్ లేని ప్రయాణాలపై విధించిన ఫైన్‌ను రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు రూ.250గా ఉంటే ఇప్పుడు రూ.500కు పెంచింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది. టికెట్ లేకుండా ప్రయాణిస్తే, వారు ప్రయాణం చేసిన దూరం వరకు అసలు టికెట్ ధరపై ఇక నుంచి రూ.500 చెల్లించాల్సిందే. ఒకవేళ ప్రయాణికుడు ఏ స్టేషన్లో ఎక్కాడో స్పష్టత లేకుంటే.. రైలు ప్రయాణం ప్రారంభమైన స్టేషన్ నుంచి ధర చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇతరుల పేరుమీద టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేస్తే ఆ టికెట్ చెల్లదు. ప్రయాణికుడు రూ.500 కట్టాలి.
లేదంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు లేదా చిరు వ్యాపారులు ఎవరైనా సరే అనుమతి లేకుండా రైళ్లలో, స్టేషన్లలో ఆహార పదార్థాలు అమ్మితే రూ.2 వేలు జరిమానా విధిస్తారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో భిక్షాటన నిషేధం. రైలు నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తే జైలుశిక్ష విధిస్తారు. మహిళలకు కేటాయించిన బెర్త్‌లు, కోచ్‌లలో పురుషులు కూర్చుంటే రూ.2500 జరిమానా విధిస్తారు. తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించినా, దూషించినా భారీగా పెనాల్టీ వేస్తారు.