ముంబై, సెప్టెంబర్ 8 : భీకరమైన అలలు సముద్రపు ఒడ్డున నిలిపి ఉంచిన ఓ మినీ బస్సును సముద్రంలోకి లాక్కెళ్లా యి. పోలీసులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సమయానికి వచ్చి ఆ బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులను ప్రమాదం నుంచి రక్షించారు. మినీ బస్సును బీచ్ ఒడ్డుకు చేర్చారు. ఆదివారం ముంబైలోని గోరాయ్ బీచ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒక మహిళ సహా ఆరుగురు ప్రయాణికులతో కూడిన ఓ మినీ బస్సు బీచ్‌లో పార్కింగ్ చేసి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రపు ఒడ్డుకు అత్యంత సమీపంలో వాహనాన్ని పార్కింగ్ చేయటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. భద్రతాపరమైన ప్రొటోకాల్ ఏదీ పాటించనందున మినీ బస్సు డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదుచేశారు.