Samsung | న్యూఢిల్లీ: ఎవరికీ అన్యాయం చేయకుండా మిలియనీర్ కావాలనుకుంటున్నారా? ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త బౌంటీ ఆఫర్ మీ కోసమే. మీరు చేయాల్సిందల్లా దాని ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్)లోని అతిపెద్ద సమస్యను కనిపెట్టడమే. ఈ పనిని విజయవంతంగా చేస్తే మిలియన్ డాలర్లు మీ సొంతమవుతాయి. మొబైల్ సెక్యూరిటీ ప్రోగ్రాంలో భాగంగా శాంసంగ్ ఈ ఆఫర్ను ప్రకటించింది. డేటాను వెలికి తీయడం, పరికరాలను అన్లాక్ చేయడం, అనధికారిక అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయడం వంటి భద్రతాపరమైన లోపాలతోపాటు ఓఎస్ దుర్భలత్వానికి సంబంధించిన సమస్యలను గుర్తించిన వారికి ఈ రివార్డు ఇవ్వనున్నట్టు శాంసంగ్ తెలిపింది.
కనిపెట్టిన లోపం తీవ్రత ఆధారంగా రివార్డు ఉంటుంది. శాంసంగ్ హార్ట్వేర్ సెక్యూరిటీ సిస్టంలోని సరికొత్త నాక్స్ వాల్ట్ విజయవంతంగా హ్యాక్ చేయడం, రిమోట్ కోడ్ను ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా టాప్ ప్రైజ్ అయిన మిలియన్ డాలర్లు సొంతం చేసుకోవచ్చు. అలాగే, అన్లాక్ చేయడం, డేటాను దొంగిలించడం, గెలాక్సీ స్టోర్ నుంచి కాకుండా ఇతర సోర్సుల నుంచి యాప్లను ఇన్స్టాల్ చేయడం వంటి వాటికి కూడా అవార్డులు ప్రకటించింది.