Milk Testing | న్యూఢిల్లీ, జూలై 11: ప్రస్తుతం సర్వం కల్తీమయంగా మారింది. పాలను కూడా కొందరు కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. డిటర్జెంట్ పౌడర్, యూరియా, వెజిటెబుల్ ఆయిల్, నల్లా నీళ్లకు కొన్ని కెమికల్స్ కలిపి సింథటిక్ పాలను తయారుచేస్తున్నారు. ఇలాంటి సింథటిక్ పాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీంతో కల్తీ పాల పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే సులువుగా కల్తీ పాలను గుర్తించే సరికొత్త పరీక్షను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, సిక్కిం విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక బృందం కనిపెట్టింది.
మెడికల్ సిరంజీలో పాలు తీసుకోవాలి. సిరంజీ సాయంతో ఓ పాల చుక్కను చిన్న గాజు పలకపై వేయాలి. కాసేపు వేచిచూడాలి. పాలు ఆవిరవుతున్న క్రమంలో పాలలోని కొన్ని కణాలు ఒకదానికి ఒకటి దగ్గరకు చేరి చివరకు పాల చుక్క అంచున ఒక చైన్లాగా ఏర్పడతాయి. అలా జరిగితే ఆ పాలు సింథటిక్ పాలని భావించవచ్చు. సాంకేతికంగా దీన్ని విశ్లేషించాలనుకొంటే.. స్మార్ట్ఫోన్లో ఆ ఫొటో తీసి తాము అభివృద్ధి చేసిన మెషీన్ లెర్నింగ్ విధానంతో పాల కల్తీని గుర్తించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.
పాలు స్వచ్ఛమైనవా? కావా? అని తెలుసుకోవడానికి అయోడిన్ పరీక్ష వంటివి చేస్తుంటారు. పాలలో నీటి శాతం, స్టార్చ్ మోతాదు ఎంత ఉన్నది అనేది దీంతో తెలుస్తుంది. అయితే సింథటిక్ పాలను ఈ పద్ధతుల్లో కచ్చితత్వంతో గుర్తించలేము. అయితే, తమ మెషీన్ లెర్నింగ్ విధానంతో సింథటిక్ పాలను 96.7% కచ్చితత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధానాన్ని త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.