న్యూఢిల్లీ, మే 13: పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం దేశంలోని మెట్రో నగరాల్లో వలస కార్మికుల్లో భయాలను రేకెత్తించడం ప్రారంభించింది. మెట్రో నగరాలలో నివసిస్తున్న వలస కార్మికులు ధరాఘాతానికి తల్లడిల్లుతూ తమ స్వస్థలాలకు తిరుగుప్రయాణం మొదలుపెట్టారు. అయితే దేశంలో ఇంధన సరఫరాలో సమస్యలేవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడించారు. ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన సంక్షోభంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో నివసిస్తున్న వేలాదిమంది వలస కార్మికులు ఘర్ వాపసీ నిర్ణయం తీసుకున్నారు.
నోయిడా కార్పొరేట్ ఆఫీసులో క్లీనర్‌గా పనిచేసే మదన్ సింగ్(మార్చిన పేరు) తన ఇంట్లో ఎల్పీజీ కనెక్షన్ లేదని చెప్పాడు. తమ ఇంట్లో తన కుటుంబ సభ్యులు నలుగురం ఉంటామని, వంట కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ వాడతామని అతను చెప్పాడు. ఇంధన సంక్షోభం కారణంగా గ్యాస్ రీఫిల్లింగ్ చార్జీలు విపరీతంగా పెరిగాయని, పెరిగిన నిత్యావసర ధరలను కూడా కలుపుకుని చూస్తే ఇక్కడ బతకడం ఇక కష్టమని నిర్ణయించుకుని సొంత గ్రామానికి వెళ్లిపోతున్నామని అతను చెప్పాడు.
దక్షిణ ఢిల్లీలో పనిమనిషిగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్న సుమ(పేరు మార్పు) తన స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిపోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని వస్తువుల ధరలు పెరిగాయన్న కారణంతో తాను ఉంటున్న ఇంటి అద్దెను కూడా ఇంటి యజమాని పెంచేశాడని, ఈ ఖర్చులను భరించలేక వచ్చే నెల సొంత ఊరికి వెళ్లిపోతున్నానని ఆమె చెప్పారు.