టెక్లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన ‘బ్లూ స్క్రీన్ ఎర్రర్’తో సాంకేతిక విపత్తు తలెత్తింది. ఊహించని ఉపద్రవం ఫలితంగా విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి. అనూహ్య పరిణామంతో అన్ని దేశాల్లో గందరగోళం మొదలైంది. ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఐటీ కంపెనీల్లో కంప్యూటర్లు షట్‌డౌన్ అవగా.. స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, ఎయిర్‌పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకూ, టీవీ చానళ్ల ప్రసారాలకూ ఆటంకాలు తప్పలేదు! సైబర్‌దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ ‘క్రౌడ్‌స్ట్రైక్’ అప్డేషన్లో వచ్చిన బగ్‌తో ఈ ప్రమాదం జరిగినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. చివరికి సమస్యను పరిష్కరించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Microsoft | న్యూఢిల్లీ/హైదరాబాద్, స్పెషల్ టాస్క్ బ్యూరో (నమస్తే తెలంగాణ) జూలై 19: మైక్రోసాఫ్ట్‌లో శుక్రవారం తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విండోస్‌తో పని చేసే లక్షలాది కంప్యూటర్లు మొరాయించాయి. వాటికవే షట్‌డౌన్ అయిపోయాయి. మళ్లీ ఆన్‌చేయగానే కంప్యూటర్ల స్క్రీన్ల మీద ‘బ్లూస్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ కనిపించింది. ‘మీ పీసీలో సమస్య తలెత్తింది. రీస్టార్ట్ చేయండి’ అనే సందేశం స్క్రీన్‌పై దర్శనమిచ్చింది. అయితే, ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా ఇదే సమస్య పునరావృతమైంది. దీంతో అనేక దేశాల్లో ఇంటర్నెట్ ద్వారా పని చేసే వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి.
బ్యాంకింగ్, విమానయాన, ఐటీ సేవల్లో తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు రద్దయ్యాయి. ఇంకొన్ని ఆలస్యమయ్యాయి. కొన్ని చోట్ల ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు సైతం నిలిచిపోయాయి. దీంతో అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రధానంగా సమస్య తలెత్తింది. విండోస్ 7 ఓఎస్‌తో నడిచే సిస్టమ్‌లు యథావిధిగా పని చేశాయి. మ్యాక్, లైనెక్స్ సిస్టమ్‌లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మైక్రోసాఫ్ట్‌పై సైబర్ దాడి జరిగిందనే ప్రచారం జరిగింది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలయ్యింది. అనేక గంటల పాటు శ్రమించిన నిపుణులు చివరకు సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. కంప్యూటర్లు మళ్లీ ఎలా ఆన్ చేయాలో వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ సూచనలు చేసింది.
మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన విండోస్ 10,11 వెర్షన్లలో, క్లౌడ్ సర్వీసులతో నడిచే పీసీలు, ల్యాప్‌టాప్‌లు, మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లోనూ ఇటీవల చేపట్టిన క్రౌడ్‌స్ట్రైక్ సెక్యూరిటీ అప్డేట్ కారణంగానే ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ (బీఎస్‌వోడీ)’ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘క్రౌడ్‌స్ట్రైక్’ అనేది అమెరికాకు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ.
ఇది 2011లో ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్‌తో పాటు దిగ్గజ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా విండోస్ సిస్టమ్స్‌లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు తామిచ్చిన తాజా సెక్యూరిటీ అప్డేట్ ‘ఫాల్కన్ సెన్సర్’లో ఓ బగ్ కారణమని క్రౌడ్‌స్ట్రైక్ కూడా అంగీకరించింది.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా భారత్ మాత్రమే కాదు అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, శాంతి-భద్రతలు, బ్యాంకింగ్, ఐటీ, రైల్వే, దవాఖాన, మీడియా, పేమెంట్ సర్వీసులు, స్టాక్ మార్కెట్లు, విమానయానం ఇలా దాదాపు అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. విండోస్‌లో సమస్య కారణంగా బ్రిటిష్ న్యూస్ ఛానెల్ స్కైన్యూస్ వార్తలను ఎయిర్ చేయడంలో అవాంతరాలు ఎదుర్కొన్నది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సమస్యలు తలెత్తాయి. అక్కడి మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయాయి. జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇలా ఐరోపాలోని అన్ని దేశాలపై ప్రభావం పడింది. ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్ అనే సూపర్ మార్కెట్ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది. పాయింట్ ఆఫ్ సేల్స్‌లో కస్టమర్ల బ్యాంకు కార్డులు కూడా పనిచేయడం లేదు.
ఏబీసీ న్యూస్ 24 బ్రాడ్క్యాస్టింగ్లోనూ సమస్యలు ఏర్పడ్డాయి. ఆస్ట్రేలియావ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలోని సిస్టమ్‌లు మొరాయించాయి. ప్రపంచవ్యాప్తంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లు పెరిగాయి. మెల్బోర్న్, వర్జిన్ ఆస్ట్రేలియా, సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలు నిలిచిపోయాయి. అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్, యూనైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఫ్రంటీయర్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఐటీ, ఐటీఈఎస్, ప్రైవేటు కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. బ్యాంకులు, దవాఖాన, మీడియాపైనా ప్రభావం పడింది. కొన్ని దేశాల్లో ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉన్న పోలీసుల వ్యవస్థలు క్రాష్ అయ్యాయి.
మైక్రోసాఫ్ట్‌లో అంతరాయంపై ఈ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. ‘క్రౌడ్‌స్ట్రైక్ విడుదల చేసిన ఒక అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యవస్థలను ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఈ సమస్య గురించి మాకు అవగాహన ఉంది. మళ్లీ సిస్టమ్‌లను సురక్షితంగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం కోసం వినియోగదారులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు అందించేందుకు క్రౌడ్స్ట్రైక్తో కలిసి పని చేస్తున్నాం’ అని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ 365 యాప్‌లు, సర్వీసుల్లో సమస్యను పరిష్కరించామని ఈ సంస్థ ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా దేశంలోని ప్రధాన రంగాలన్నీ ప్రభావితమయ్యాయి. విమాన సర్వీసుల దగ్గరి నుంచి దవాఖాన, బ్యాంకింగ్ వరకు ఇలా అన్ని సర్వీసుల్లోనూ సమస్యలు తలెత్తాయి. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్, విస్తారా తదితర ప్రముఖ విమానయాన సంస్థల సేవలపై దీని ప్రభావం పడింది. సాంకేతిక కారణాల వల్ల బుకింగ్, చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ ఇష్యూయింగ్, ఫ్లైట్ స్టేటస్ చెకింగ్ తదితర సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఒక్క ఇండిగో విమానయాన సంస్థే 200కు పైగా విమాన సేవలను నిలిపేసింది. ఇక, బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 గుండా ప్రయాణాలు సాగిస్తున్న 90 శాతం విమానాలు నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లోని ఫ్లైట్ ఆపరేషన్లలో అంతరాయాలు కలిగాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు, దవాఖానల్లోనూ సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు నెటిజన్లు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ టీమ్, మైక్రోసాఫ్ట్ అజుర్ సర్వీసులతో పాటు ఇన్స్టాగ్రామ్, అమెజాన్, జీమెయిల్ సేవల్లోనూ సమస్యలు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు.
కంప్యూటర్, లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద హఠాత్తుగా ఓ బ్లూ స్క్రీన్ కనిపిస్తుంది. అందులో ఎర్రర్ మెసేజీ ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ ఒక్కసారిగా షట్‌డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. ఈ సమస్యను ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ లేదా ‘బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్’ లేదా ‘స్టాప్ కోడ్ ఎర్రర్స్’గా పిలుస్తారు. సాధారణంగా హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్ తలెత్తుతుంటాయి. ఏదైనా హార్డ్‌వేర్‌ను కొత్తగా ఇన్స్టాల్ చేయడం వల్ల బ్లూ స్క్రీన్ ఎర్రర్ తలెత్తి ఉంటే.. సిస్టమ్‌ను షట్‌డౌన్ చేసి, హార్డ్‌వేర్‌ను తొలగించి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా విండోస్‌లో తలెత్తిన ఎర్రర్ సాఫ్ట్వేర్ సమస్య కిందకు వస్తుంది.
తామిచ్చిన తాజా సెక్యూరిటీ అప్డేట్లో ఓ బగ్ కారణంగానే ఈ సమస్య తలెత్తింది. అయితే, ఇది భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదు. ఇప్పటికే సమస్యను గుర్తించి డీబగ్‌ను ఫిక్స్ చేశాం.
– క్రౌడ్ స్ట్రైక్ సీఈవో జార్జ్ కుర్జ్