న్యూఢిల్లీ : కాషాయ పార్టీకి గతంలో భాగస్వామ్య పక్షంగా వ్యవహరించిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) రానున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టు కట్టనుంది. తృణమూల్‌తో పొత్తు పెట్టుకుంటామని ఎంజీపీ సోమవారం ప్రకటించింది.
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయాలని పార్టీ కే్ంద్ర కమిటీ నిర్ణయించిందని ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధవళికర్ తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది ఆ తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. గోవా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే తాము చేతులు కలిపామని ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు.
కాగా 2019లో ఎంజీపీ బీజేపీ భాగస్వామ్య పక్షంగా వ్యవహరించింది. తాము బీజేపీని పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించామని, ఆప్, కాంగ్రెస్, టీఎంసీ వంటి ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నామని దీపక్ తెలిపారు. మరోవైపు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతోంది.