ముంబై (నమస్తే తెలంగాణ), ఆగస్టు 23: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్తదారుల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో పెండ్లి ఆహ్వానం సందేశం పంపి..అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 లక్షలు కాజేశారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ పంపిన ఫైల్‌పై అతడు క్లిక్ చేయగానే, వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరాగాళ్లు సేకరించి, పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు. మహారాష్ట్ర హింగోలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్నాడు. బాధితుడు వాట్సాప్‌కు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ‘వెల్కం. ఆగస్టు 30న పెండ్లి ఉంది.
షాదీమే జరూర్ ఆయే (పెండ్లికి తప్పకుండా రండి)’ అన్న సందేశం వచ్చింది. దీంతోపాటు పీడీఎఫ్ ఫైల్‌గా కనిపించే ఏపీకే ఫైల్‌ను సైబర్ నేరగాళ్లు పంపారు. దీనిపై బాధితుడు క్లిక్ చేయటంతో ఫోన్ హ్యాక్‌కు గురైంది. కొంత సేపటికే రూ.1.9 లక్షలు అతడి బ్యాంక్ ఖాతా నుంచి మాయమయ్యాయి. గతేడాది ఈ తరహా స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, థానేలో సైబర్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. గోవాకు చెందిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.