న్యూఢిల్లీ, మార్చి 19 : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య దారుణంగా హత్యచేసింది. అనంతరం అతడి శరీరాన్ని 15 ముక్కలు చేసి, డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసిన దారుణ ఘటన యూపీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె పుట్టిన రోజు వేడుక కోసం లండన్ నుంచి వచ్చిన మీరట్ నివాసి సౌరభ్ రాజ్‌పుత్ (35)ను అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా దారుణంగా హత్య చేశారు. లండన్‌లో మర్చంట్ నేవీ అధికారిగా పనిచేసే సౌరభ్.. రస్తోగిని 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2019లో వీరికి ఒక పాప జన్మించింది. పెళ్లయిన తర్వాత భార్యతోనే కలిసి ఉండాలని ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావడంతో అద్దె ఇంట్లోకి మారారు. తన భార్యకు సాహిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించిన సౌరభ్ ఆమెతో విడాకులు తీసుకోవాలని ఆలోచించాడు.
అయితే కూతురు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ ఆలోచన విరమించుకున్నాడు. 2023లో తిరిగి మర్చంట్ నేవీలో చేరేందుకు లండన్ వెళ్లాడు. ఫిబ్రవరి 28న కుమార్తె పుట్టిన రోజు కోసం 24నే భారత్ వచ్చాడు. మార్చి 4న సౌరభ్ భోజనంలో ఆమె భార్య ముస్కాన్ నిద్ర మాత్రలు కలిపింది. తర్వాత సాహిల్, ఆమె కలిసి అతడిని చాకుతో పొడిచి హత్య చేశారు. మృతదేహాన్ని 15 ముక్కలు చేసి దానిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి దానిలో సిమెంట్ నింపి సీల్ చేశారు. బంధువులు, స్నేహితులను తప్పుదోవ పట్టించడానికి సౌరభ్ ఫోన్ ద్వారా మెసేజ్‌లు పంపారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా జవాబు రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, సౌరభ్‌ను తామే చంపినట్టు అంగీకరించారు. దీంతో 15 రోజులుగా ఫ్లాట్‌లోని డ్రమ్ములో సిమెంట్ మధ్య గడ్డకట్టి ఉన్న సౌరభ్ అవశేషాలను పోలీసులు గుర్తించారు. పగలకొట్టినా అవి బయటకు రాకపోవడంతో డ్రిల్లింగ్ చేసి బయటకు తీసి, ఫోరెన్సిక్‌కు పంపారు.
తమ కుమార్తె దారుణ చర్యపై రస్తోగి తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముస్కాన్, సాహిల్ ఇద్దరూ డ్రగ్స్‌కు అలవాటు పడి ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. సౌరభ్‌ను హత్య చేసినట్టు ముస్కాన్ తమ వద్ద అంగీకరించిందన్నారు. కొడుకు లాంటి సౌరభ్‌ను పొట్టనపెట్టుకుందని, ఆమెకు జీవించే హక్కు లేదని, ఆమెను ఉరి తీయాల్సిందేనని వారు అన్నారు.