Women’s Commission | లక్నో, నవంబర్ 8: టైలరింగ్ షాపుల్లో ఇక నుంచి మహిళల దుస్తుల కొలతలు పురుష టైలర్లు తీసుకోరాదని ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ప్రతిపాదించింది. అంతేకాకుండా జిమ్‌ల్లో మహిళలకు పురుషులు శిక్షకులుగా వ్యవహరించకూడదని, మహిళల జుట్టును కత్తిరించకూడదని తాము ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్టు తెలిపింది.
బ్యాడ్ టచ్‌తో పాటు మహిళల పట్ల పురుషుల దురుద్దేశాలను అరికట్టడానికి ఈ ప్రతిపాదనలు చేసినట్టు యూపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ తెలిపారు. జిమ్‌లు, కోచింగ్ కేంద్రాలు, బట్టల దుకాణాలలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, స్కూల్ బస్సులలో భద్రత కోసం ఒక మహిళను ఉంచాలని గత నెల 28న నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదించామన్నారు.
టైలరింగ్ షాపులు, మహిళా బొటిక్ల్లో కొలతలు తీస్తున్నప్పుడు, జిమ్‌లు, యోగా కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నప్పుడు పురుషుల నుంచి ‘బ్యాడ్ టచ్’ను ఎదుర్కొంటున్నామని అత్యధికంగా ఫిర్యాదులు వచ్చినట్టు ఆమె చెప్పారు. దీనిని నివారించడానికి టైలర్ పురుషుడు అయినప్పటికీ కొలతలు మాత్రం మహిళే తీయాలని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు అమలు చేసేలా చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించనున్నట్టు ఆమె తెలిపారు.