న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) నుంచి రూ. 13,000 కోట్ల రుణాన్ని పొంది బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు బెల్జియం అధికారులు అరెస్టు చేశారు. పీఎన్బీ కేసులో చోక్సీ రెండవ నిందితుడు కాగా మొదటి నిందితుడైన నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు. చోక్సీని ఏప్రిల్ 12న(శనివారం) అరెస్టు చేసినట్టు బెల్జియం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ ఆఫ్ జస్టిస్ అధికారులు ప్రకటించారు. చోక్సీ అరెస్టు కోసం సీబీఐ అభ్యర్థన పంపినట్టు వారు చెప్పారు. తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కోసం చోక్సీని నిర్బంధంలో ఉంచినట్టు వారు చెప్పారు. న్యాయపరమైన సహాయం అతనికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. వైద్య చికిత్స కోసం 2023 నవంబర్లో 65 ఏళ్ల చోక్సీ బెల్జియం చేరుకున్నాడు. 2018లో భారత్ నుంచి పారిపోయిన చోక్సీ ఆంటిగ్వా చేరుకుని ఆ దేశ పౌరసత్వం తీసుకున్నాడు.
ఆ దేశంలో అతని భారత పౌరసత్వం కూడా చెల్లుబాటు అవుతుంది. గతంలో చోక్సీ చేసిన వాదనను పరిశీలించిన ఇంటర్పోల్ అతనిపై జారీచేసిన రెడ్ కార్నర్ నోటీసును నిలిపివేసింది. అయితే భారత దర్యాప్తు సంస్థలు మాత్రం భారత్, బెల్జియం మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా చోక్సీని తమకు అప్పగించాలని అభ్యర్థిస్తూ వస్తున్నాయి. ముంబైలోని ప్రత్యేక కోర్టు చోక్సీ అరెస్టుకు రెండుసార్లు వారెంట్లు జారీచేయగా వీటిని సీబీఐ బెల్జియం అధికారులకు అందచేసింది. ముంబైలోని పీఎన్బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్లో రుణ మోసానికి పాల్పడినట్టు చోక్సీ, నీరవ్ మోదీ, వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, బ్యాంకు అధికారులపై 2018లో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. గీతాంజలి జెమ్స్ అనే సంస్థ పేరిట చోక్సీ, నీరవ్ మోదీ బ్యాంకులో రుణ మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు నమోదయ్యాయి.