షిల్లాంగ్: మేఘాలయలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (UDP), భారతీయ జనతాపార్టీ (BJP), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (HSPDP), ఇండిపెండెంట్లతో కలిసి ఎన్పీపీ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి ‘మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్ 2.0’ గా నామకరణం చేశారు. మొత్తం 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో కూటమి సభ్యుల బలం 45గా ఉంది.
ఇక కూటమిలో ప్రధాన పార్టీ, కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ నుంచి నూతన మంత్రివర్గంలో 8 మందికి పదవులు దక్కనున్నాయి. అదేవిధంగా యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున క్యాబినెట్ బెర్త్‌లు దక్కించుకోనున్నారు. ఈ మేరకు ఇవాళ సంగ్మా నేతృత్వంలో మిత్రపక్షాలు సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి.
కాగా, కాన్రాడ్ సంగ్మా మంగళవారం మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 2న వెల్లడయ్యాయి. మొత్తం 60 స్థానాలకుగాను ఒక అభ్యర్థి మరణంతో 59 స్థానాలు ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్పీపీ 26, యూడీపీ 11, కాంగ్రెస్ 5, టీఎంసీ 5, వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీ 4, బీజేపీ 2, హెచ్ఎస్పీడీపీ 2, ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో గెలిచారు.