PSC Meet : విదేశీ వ్యవహారాల (External Affairs) పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (PSC) సమావేశమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ హౌస్ బిల్డింగ్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) .. ‘భారత్-బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు’ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేయనున్నారు.
ఇటీవల షేక్ హసీనా పదవీచ్యుతురాలు అయినప్పటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు సన్నగిల్లుతూ వచ్చాయి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయి. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌కు చెందిన చిన్మయి క్రిష్ణదాస్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఆ దేశంలోని కీలక నేతలతో సమావేశమై.. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చే ప్రయత్నం చేశారు. ఇవాళ బంగ్లాదేశ్ నుంచి తిరిగొచ్చిన ఆయన.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో బంగ్లా టూర్ వివరాలను వెల్లడించనున్నారు.