లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన హత్య (Meerut Murder) కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను దారుణంగా హత్య చేసిన తర్వాత భార్య ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్ శుక్లా కొన్ని పొరపాట్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. మార్చి 3 రాత్రివేళ సౌరభ్‌ను కత్తితో పొడిచి వారిద్దరూ చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. ఖాళీ ప్లాస్టిక్ డ్రమ్స్లో వాటిని ఉంచి తడి సిమ్మెంట్‌తో నింపారు. కొన్ని రోజుల తర్వాత ఆ డ్రమ్‌ను ఎక్కడోచోట పడేసి హత్య ఆనవాళ్లు, ఆధారాలు నాశనం చేయాలని ప్లాన్ వేశారు.
కాగా, సౌరభ్ హత్య తర్వాత ముస్కాన్, సాహిల్ కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. రెండు వారాలపాటు అక్కడ ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యారు. మార్చి 17న వారిద్దరూ మీరట్‌కు తిరిగి వచ్చారు. సౌరభ్ మృతదేహం భాగాలున్న డ్రమ్‌ను పడేసేందుకు ప్రయత్నించారు.
మార్చి 18న ఆ డ్రమ్‌ను అక్కడి నుంచి తరలించేందుకు కొందరు కూలీలను ముస్కాన్ పిలిపించింది. అయితే సిమ్మెంట్ గట్టిపడటంతో ఆ డ్రమ్ చాలా బరువుగా మారింది. దీంతో కూలీలు దానిని ఎత్తలేకపోయారు. పలుసార్లు వారు ప్రయత్నించగా డ్రమ్ మూత ఊడిపోయింది. సౌరభ్ మృతదేహం భాగాలున్న దాని నుంచి దుర్వాసన వచ్చింది. అనుమానించిన కూలీలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఈ పరిణామంతో ముస్కాన్ భయాందోళన చెందింది. వెంటనే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. తొలుత సౌరభ్ సోదరి, ఆమె భర్తపై ఆ హత్యను మోపేందుకు ప్రయత్నించింది. అయితే ముస్కాన్ తల్లి గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపెట్టింది. సాహిల్‌తో కలిసి సౌరభ్‌ను హత్య చేసినట్లు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ముస్కాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
కాగా, సౌరభ్ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ముస్కాన్ ఇంటికి వారు చేరుకున్నారు. అక్కడున్న ప్లాస్టిక్ డ్రమ్‌ను కోశారు. సిమ్మెంట్‌తో ఉన్న మృతదేహం భాగాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యా కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.