న్యూఢిల్లీ, మే 2: దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రస్తుత స్థితిగతులపై మీడియా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ విడుదల చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 157వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పలువురు మీడియా సంఘాల ప్రతినిధులు, ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సీకే నాయక్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాఘవన్ శ్రీనివాసన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారత్‌లో పత్రికా స్వేచ్ఛ పరిస్థితులు దిగజారాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పాత్రికేయులపై దాడులు యాదృచ్ఛికం నుండి ఉద్దేశపూర్వకంగా మారాయని అంతర్జాతీయ ప్రెస్ క్లబ్‌ల సంఘం అధ్యక్షుడు అవ్వాద్ అన్నారు. నిజం బయటకు రాకుండా అడ్డుకోవడానికి జరుగుతున్న వ్యవస్థీకృత ప్రయత్నమిదని అన్నారు. పాత్రికేయులకు సంఘీభావం అవసరమైన తరుణంలో సమన్వయంతో కూడిన ప్రతిఘటన జర్నలిస్ట్ సంఘాల నుంచి లేదంటూ సీకే నాయక్ వాపోయారు.