Ayatollah Ali Khamenei | న్యూఢిల్లీ: ఇరాన్ అధినేత అయతుల్లా ఖమేనీ భారతీయ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఇస్లామిక్ సమాజంగా మన ఉమ్మడి గుర్తింపు పట్ల మనం ఉదాసీనంగా ఉండేలా చేయడానికి ఇస్లాం శత్రువులు ఎల్ల వేళలా ప్రయత్నిస్తున్నారు. మయన్మార్, గాజా, ఇండియా లేదా ఏదైనా ఇతర ప్రదేశంలో ఓ ముస్లిం అనుభవిస్తున్న ఇబ్బందులను పట్టించుకోకపోతే మనల్ని మనం ముస్లింలుగా పరిగణించుకోలేం’ అని ఖమేనీ చెప్పారు.
మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ‘ఇరాన్ సుప్రీం లీడర్ భారత దేశంలోని మైనారిటీల గురించి చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. అవి తప్పుడు సమాచారంతో కూడినవి. ఆమోదయోగ్యం కానివి. మైనారిటీల పట్ల వ్యవహరించడం గురించి విమర్శించే దేశాలు మొదట తమ దేశాల్లోని మానవ హక్కుల రికార్డులను పరిశీలించుకోవాలి’ అని సలహా ఇచ్చింది.