న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (Jaishankar) పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరుగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సమ్మిట్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లే భారత ప్రతినిధి బృందానికి జైశంకర్ నేతృత్వం వహిస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ప్రకటించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి ఈ ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ‘అక్టోబర్ 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరుగనున్న ఎస్సీవో శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ప్రతినిధి బృందానికి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నాయకత్వం వహిస్తారు’ అని అన్నారు.
కాగా, రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షులతో 2001లో చైనాలోని షాంఘైలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో)ను ఏర్పాటు చేశారు. 2017లో భారత్, పాకిస్థాన్ శాశ్వత సభ్యత్వం పొందాయి.
మరోవైపు 2023 జూలైలో భారత్ నిర్వహించిన వర్చువల్ సమ్మిట్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. అతిపెద్ద ట్రాన్స్-రీజినల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా, ప్రభావవంతమైన ఆర్థిక, భద్రతా కూటమిగా రాణించిన ఎస్సీవోలో ఇరాన్ కూడా గత ఏడాది శాశ్వత సభ్యత్వం పొందింది.