న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మాత్రం కుదుటపడలేదు. బుధవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆమ్ ఆద్మీ కౌన్సిలర్లు ఓటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వినియోగించారని, బ్యాలెట్ రహస్యంగా ఉంచాలనే నిబంధనను ఉల్లంఘించారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. మళ్లీ ఎన్నిక జరపాలని పట్టుబట్టారు.
రెండు పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో సభ దాదాపు 12 కంటే ఎక్కువసార్లు వాయిదా పడింది. బుధవారం రాత్రంతా ఇదే కొనసాగింది. దీంతో చివరకు గురువారం తెల్లవారు జామున సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మళ్లీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహించేందుకు కొత్త బ్యాలెట్ పేపర్లను ముద్రించాల్సి ఉంటుందని, ఇందుకు కొంత సమయం పడుతుందని అధికారులు మేయర్‌కు నివేదించారు.